తిరుపతి జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:44 AM
రెండు మండలాల పరిధిలోని మూడు పల్లెల రైతులను ఓ మదపుటేనుగు మంగళవారం రాత్రంతా పరుగులు పెట్టించింది.
మూడు పల్లెల రైతులను రాత్రంతా పరుగులు పెట్టించిన గజరాజు
డ్రోన్ విజువల్స్‌తో అప్రమత్తం చేసిన అటవీశాఖ సిబ్బంది
ఎర్రావారిపాలెం(తిరుపతి): రెండు మండలాల పరిధిలోని మూడు పల్లెల రైతులను ఓ మదపుటేనుగు మంగళవారం రాత్రంతా పరుగులు పెట్టించింది. నల్లటి ఆకారంలో మంద నుంచి నెట్టివేయబడ్డ మదపుటేనుగు టార్చిలైట్ల వెలుగులో మీదకు దూసుకురావడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు వెళ్లిన రైతులు ప్రాణభీతితో పరుగులు తీశారు. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ తుమ్మసేనుపల్లెకు చెందిన సిద్ధమ్మకు చెందిన వరిపంటను మంగళవారం రాత్రి మదపుటేనుగు ధ్వంసం చేసింది. దేవరకొండ గ్రామం తూమువానికుంట కింద సాగుచేసిన రామయ్య వరి పంటపై దాడిచేసింది.
పక్కనే ఉన్న వేరుశనగ పంటను తిని ధ్వంసం చేసింది. పంటల పైకి రాకుండా నిలువరించేందుకు వంగుమళ్లవారిపల్లె రైతులు 50మంది దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. అయితే అది తిరగబడుతూ.... టార్చిలైట్ వెలుతురులో రైతులపైకి దూసుకురావడంతో వారంతా పరుగులు తీశారు. వారితో పాటే గజరాజు కూడా ఊరిలోకి వచ్చింది. రైతులు ట్రాక్టర్ల శబ్దంతో తరిమారు. దీంతో పక్కనే ఉన్న మల్లెలవాండ్లపల్లె ఇండ్ల వెనుకకు చేరింది. అక్కడ కూడా రైతులు గుమికూడి టపాసులు, భారీ శబ్దాలతో బెదిరించేదుకు ప్రయత్నించే కొద్దీ వారి మీదకు దూసుకొచ్చింది. ఎఫ్‌బీవో నిఖిల్ ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు డ్రోన్ కెమెరాతో ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేయడంతో రైతులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
బుధవారం వేకువజామున 4 గంటలకు ఎర్రావారిపాలెం మండలం పచ్చారవాండ్లపల్లె సమీపం వరకు మదపుటేనుగును దారి మళ్లించారు. ఆ క్రమంలో ఇమాం హుసేన్, నాగభూషణ పొలాల వద్ద ఉన్న గుడిసెలను నేలకూల్చింది. రాత్రంతా రెండు మండలాల్లోని మూడు పల్లెల్లో మదపుటేనుగు బీతావహ పరిస్థితి కల్పించింది. చీకట్లో ఏనుగు తరుముతుండడంతో పలువురు రైతులు తప్పించుకొనే క్రమంలో కింద పడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఫారెస్టు అధికారులు డ్రోన్ కెమెరాలతో కదలికలు చెప్పడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఎట్టకేలకు 11 ఏనుగులు వెళ్లిన ఎలిఫెంట్ కారిడార్ మార్గంలో మదపుటేనుగు చింతగుంట పంచాయతీ సమీపంలో తిష్ఠవేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన..
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లోఉద్యోగి అనుమానాస్పద మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News