బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లోఉద్యోగి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:42 AM
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కో - ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస శర్మ మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగి పేరుతో ముఖ్యవ్యక్తి 25 లక్షల లోన్
లోన్ చెల్లించాలంటూ అధికారుల ఒత్తిడి
ఆ రుణం తనది కాదన్నా వినిపించుకోని వైనం
విజయవాడ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం
మధ్యలో గోదావరిలో దూకి ఉద్యోగి ఆత్మహత్య
అది హత్యే అంటున్న బ్రాహ్మణ సంఘాలు
లోన్ తీసుకున్న వారు చంపించారంటూ ఆరోపణ
కారకులపై హత్య కేసు పెట్టాలని డిమాండ్
5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్న బ్రాహ్మణ చైతన్య వేదిక
అమరావతి/గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కో - ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస శర్మ మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనది ఆత్మహత్య కాదని హత్య అని దేవదాయ శాఖ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు బ్రాహ్మణ సంఘాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గుర్తి శ్రీనివాస శర్మ ఏడాది క్రితం ఓ ముఖ్యవ్యక్తి కోసం కో- ఆపరేటివ్ సోసైటీ ఉన్నతాధికారుల బలవంతంతో రూ. 25 లక్షల లోన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లోన్‌కు సంబంధించి ఒక్క వాయిదా కూడా చెల్లించకోవడంతో శ్రీనివాస శర్మపై ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువచ్చారు.
లోన్ తీసుకున్న వ్యక్తే దానిని తిరిగి కడతాడని, తనకు సంబంధం లేదని శ్రీనివాస శర్మ ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నారు. అయినా అతనిపై మరింత ఒత్తిడి చేయడంతో ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో ఇటీవల ఓ సూసైడ్ నోట్ పెట్టారు. తాను ఎవ్వరి వద్ద అప్పు చేయలేదని, తన బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయని నోట్లో పేర్కొన్నారు. అయినా కూడా బుధవారం లోన్ రీకవరీ పేరుతో దేవదాయ శాఖ ఉన్నతాధికారి, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉన్నతాధికారులు అతనిని తీసుకుని నేరుగా ఆయన స్వగ్రామమైన కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామానికి బయలుదేరారు.
చించినాడ గోదావరి బ్రిడ్జి మధ్యలో అతను కారు దిగి గోదావరిలో దూకినట్లు అధికారులు చెబుతున్నారు. అతనే గోదావరిలో దూకారా లేదా అధికారులే అవినీతిని కప్పిపుచ్చేందుకు నదిలోకి నెట్టేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేస్తే కేసు పెట్టకుండా రీకవరీకి ప్రయత్నాలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం..:
శ్రీనివాస శర్మ మృతిపై బ్రాహ్మణ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ, కో-ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ సీఈవోలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఒక బ్రాహ్మణ ఉద్యోగిని కడతేర్చారని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం విచారణ పేరుతో శ్రీనివాస శర్మను మానసికంగా, శారీరకంగా ఉన్నతాధికారులు వేధించి బలవంతంగా కాగితాల మీద సంతకాలు చేయించారని ఆరోపించారు.
బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే చట్ట ప్రకారం షోకాజ్ నోటీస్ ఇచ్చి, అతని సమాధానం నచ్చకపోతే కేసు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ అధికారులే పోలీస్ అవతారం ఎత్తి ఇలా చేశారని ఆరోపించారు. స్వయంగా అధికారులే రికవరీ ఏజెంట్లుగా ఎందుకు మారారని ప్రశ్నించారు. ఉద్యోగి మృతికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. మృతిని కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట