Share News

పోటాపోటీ

ABN , Publish Date - Oct 29 , 2026 | 02:53 AM

ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రచార ఉధృతి పెరిగే కొద్దీ ప్రజల దృష్టి ఆ వైపు మళ్లింది. సీట్ల కేటాయింపు విషయంలో అధికార కూటమి పార్టీల మధ్య సర్దుబాటు కొలిక్కివచ్చింది

పోటాపోటీ

రసవత్తరంగా పురపోరు

పొత్తు సమస్యల నుంచి బయటపడిన కూటమి

ప్రతి ఓటరును కలిసే ప్రయత్నంలో టీడీపీ

వైసీపీ ఆర్భాటపు ప్రచారం.. ప్రలోభాలకూ శ్రీకారం

ఒంగోలు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రచార ఉధృతి పెరిగే కొద్దీ ప్రజల దృష్టి ఆ వైపు మళ్లింది. సీట్ల కేటాయింపు విషయంలో అధికార కూటమి పార్టీల మధ్య సర్దుబాటు కొలిక్కివచ్చింది. కూటమిలో ముఖ్యమైన టీడీపీ నాయకులు ప్రతి ఓటరును కలిసే ప్రయత్నంలో గ్రౌండ్‌ వర్క్‌ చేస్తుండగా, వైసీపీ మాత్రం ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైంది. ఆపార్టీ అభ్యర్థులకు అధి ష్ఠానం నుంచి కూడా ఆర్థిక సహకారం అందడంతో ముందు గానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే చర్యలను ప్రారంభించారు. వార్డులు, డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రలోభ కార్యక్రమాలు ప్రారంభించడంతో మందుబాబుల హడావుడి పెరిగిపోయింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఐదు మున్సిపాలిటీల్లో నవంబరు 1వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో అధికార కూటమి పార్టీల మధ్య తలెత్తిన విభేదాలకు అధిష్ఠానం పుల్‌స్టాప్‌ పెట్టింది. కూటమి పార్టీలో ముఖ్యమైన టీడీపీ అన్నిచోట్లా కీలకంగా వ్యవహరిస్తోంది. ఒకచోట చైర్మన్‌ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి ఇచ్చింది. మిగి లిన అన్ని స్థానాల్లో మేయర్‌, చైర్మన్‌ పదవులతోపాటు డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులను సర్దుబాటుకు అనుగుణంగా పోటీకి దించింది. వైసీపీ నేతలు కూడా పల్లెల్లో పోటీచేసే విషయంలో విఫలమైనప్పటికీ మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింప డంలో సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్‌, ఇతరత్రా మరికొన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ చీరాల మిన హా అన్నిచోట్లా టీడీపీ, వైసీపీ అభ్యర్థులే ప్రధాన పోటీదారుల య్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి, చీరాల మున్సిపాలి టీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దర్శిలో మొత్తం స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోగా, కనిగిరిలో రెండు వార్డులు మినహా టీడీపీ కైవసం చేసుకుంది. కందుకూరు, పొదిలిలో నవంబరు మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒంగోలు కార్పొరేషన్‌ టీడీపీ చేతికి చిక్కే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 62 డివిజన్లల్లో మూడింటిని ఇప్పటికే ఆ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. అయితే డివిజన్‌ల కేటాయింపులో టీడీపీ, జనసేన మధ్య సరైన అవగాహన కుదరకపోవడం కొంతమేర నష్టాన్ని కల్గించే అవకాశం కనిపించింది. చివరకు టీడీపీ, జనసేన రాష్ట్ర నేతలు జోక్యం చేసుకొని స్నేహపూర్వక పోటీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆదేశించడంతో ఇరుపార్టీల మధ్య డివిజన్ల కేటాయింపు జరిగింది. టీడీపీ 46 డివిజన్లలో పోటీలో ఉండగా, 11చోట్ల జనసేన, రెండు చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. బీజేపీ పోటీలో ఉన్న రెండుచోట్లా జనసేన అభ్యర్థులు కొనసాగుతున్నారు. సుమారు పది చోట్ల టీడీపీ, జనసేన గుర్తులు బ్యాలెట్‌ పత్రాల్లో ప్రత్యక్షం కాబోతున్నాయి. పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ కొన్ని డివిజన్లలో పూర్తిస్ధాయిలో ఇరుపార్టీల అభ్యర్థులు సఖ్యతపడే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా వైసీపీ నాయకులు తమకు దక్కే వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న నమ్మకంతో ఉన్నారు. పోలింగ్‌ రోజు జరిగే అనూహ్య పరిణామాలను పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఐదు నుంచి 12 వార్డుల మధ్య వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మేయర్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప, వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. కాంగ్రెస్‌, బీఎస్పీలాంటి పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు రంగంలో ఉన్నారు. వీరెవరికీ గెలుపోటములను శాసించే స్థాయి ఉండబోదని స్పష్టమైంది. ఎమ్మెల్యే జనార్దన్‌ ఆధ్వర్యంలో నిర్థిష్టమైన గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభమైంది. అయితే వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌కు పార్టీశ్రేణుల్లో మంచిపేరు ఉండటంతోపాటు అధిష్ఠానం నుంచి కొంతమేర ఆర్థిక సహాయం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ ఇన్‌చార్జి చుండూరు రవి ఆధ్వర్యంలో ప్రచారంలో జోరు పెంచారు. కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరని డివిజన్లపై వారు దృష్టి సారించారు.

అద్దంకిలో వార్‌ వన్‌సైడ్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అద్దంకి మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 32 వార్డుల్లో మూడు టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 25 వార్డుల్లో టీడీపీ, 4 వార్డుల్లో జనసేన పోటీలో ఉన్నాయి. వైసీపీ అన్ని వార్డుల్లో అభ్యర్థుల నుంచి పోటీలో పెట్టగలిగినప్పటికీ దీటైన అభ్యర్థులను రంగంలో తేవడంలో విఫలమైంది. ఇక్కడ ఆ పార్టీకి ఇటు అభ్యర్థి, అటు అధిష్ఠానం నుంచి తెచ్చిన డబ్బులతో హడావుడి చేసే ప్రయత్నం చేసినా టీడీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. టీడీపీ నుంచి కాకాని అశోక్‌, వైసీపీ నుంచి సురేష్‌లు చైర్మన్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మరో నలుగురు ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ వారు ప్రభావం చూసే అవకాశం లేదు. ఏ కోణంలో పరిశీలన చేసినా టీడీపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వార్డుల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చీమకుర్తిలో రసవత్తరం

చీమకుర్తిలో టీడీపీ నుంచి శిద్దా సుధాకర్‌, వైసీపీ నుంచి మేడగం శ్రీదేవి, కాంగ్రెస్‌ నుంచి సుబ్బారావు మరికొందరు స్వతంత్రులు చైర్మన్‌ పదవికి పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ 28 వార్డులు ఉండగా అన్నిచోట్లా పోటీ జరుగుతోంది. టీడీపీ 26, జనసేన 2 వార్డుల్లో బరిలో ఉన్నాయి. వైసీపీ అన్నిస్థానాల్లో పోటీలో ఉంది. ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌కు తోడు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ టీడీపీ అభ్యర్థి విజయం కోసం పూర్తిస్థాయిలో పనిచేయడం అదనపు బలంగా మారింది. అభ్యర్థి ఎంపికలో వచ్చిన మనస్పర్థలను పెద్దమనిషిగా గుర్తింపు ఉన్న రాఘవరావు సరిచేయగలిగారు. స్థానికుడైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైసీపీ విజయానికి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. దర్శిలో మున్సిపల్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టడంలో విఫలమైన ఆయన చీమకుర్తి విషయంలో పట్టుదలతో ఉన్నారు. ఆరంభం నుంచి తమ కుటుంబానికి దూరంగా ఉంటున్న రెండో వర్గానికి చెందిన వారికి చైర్మన్‌ టికెట్‌ ఇచ్చి అసమ్మతివర్గాన్ని సైలెంట్‌ చేయగలిగారు. ఇరుపార్టీల వారు చైర్మన్‌ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికీ వార్డుల్లో అయితే పూర్తి ఆధిక్యత టీడీపీకి కనిపిస్తోంది.

మార్కాపురం టీడీపీదే

మార్కాపురం మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా అందరికీ సుపరిచితులైన వక్కలగడ్డ మల్లికార్జున్‌, వైసీపీకి వైద్యురాలిగా సుపరిచితురాలైన డాక్టర్‌ కనకదుర్గ పోటీలో ఉన్నారు. మొత్తం 40 వార్డుల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. ఇక్కడ కూటమి పార్టీలు పూర్తిస్థాయిలో ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. ఆ విషయంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి సఫలీకృతులయ్యారు. ఇక 2014-2019 మధ్య ప్రస్తుత టీడీపీ అభ్యర్థి మల్లికార్జున్‌ సతీమణి చైర్మన్‌గా ఉన్నారు. అప్పట్లో జరిగిన అభివృద్ది, మల్లికార్జున్‌ చేసిన సేవా కార్యక్రమాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఆది నుంచి పట్టణంలో టీడీపీదే అధిక్యత. ఎమ్మెల్యే నారాయణరెడ్డి వర్గానికి మంచి పట్టుంది. ఇక జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం పట్ల సాధారణ ప్రజల్లో టీడీపీ పట్ల సానుకూలత బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ విజయానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డుల్లోనూ మెండుగా ఉంది. వార్డుల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించడంలో టీడీపీ సఫలీకృతం కాగా వైసీపీ విఫలమైంది. అయితే వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మొత్తం స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దించి ప్రచారంలో ముందున్నారు. డాక్టర్‌గా కనకదుర్గకు ఉన్న పరిచయాలకు తోడు సామాజికంగా, రెడ్డి సామాజికవర్గం ఓటర్ల నుంచి మద్దతు లభించవచ్చన్న నమ్మకాన్ని వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

గిద్దలూరులో నువ్వానేనా!

గిద్దలూరు మున్సిపాల్‌ చైర్మన్‌ పదవిని చివరి క్షణంలో బీజేపీకి కేటాయించడంతో ఏర్పడిన వివాదం నిన్న, మొన్నటివరకు కూటమికి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి సీఎం నేరుగా జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి టీడీపీ రెబల్‌ అభ్యర్థులను తప్పించి బీజేపీ గెలుపునకు పనిచేస్తున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ నారాయణ, వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ బాలనర్సింహారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 25 వార్డుల్లో టీడీపీ, 3 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో పట్టణంలో సుపరిచితులు కాగా వైసీపీ అభ్యర్థికి ఆర్థిక, సామాజిక, అంగబలం అధికం. పార్టీ ఇన్‌చార్జి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి సపోర్టు ఉంది. అయితే ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పార్టీ బలంతోపాటు తనకున్న వ్యక్తిగత బలాన్ని కూడా ఉపయోగిస్తున్నందున పోటీ నువ్వా-నేనా అన్నట్లు మారింది. బీజేపీ అభ్యర్థికి సామాజిక, ఆర్థికబలం లేకపోవడం మైనస్‌. అయితే వైసీపీ అభ్యర్థికి దూకుడు మనస్తత్వం అన్న పేరు మైనస్‌గా ఉంది. పోటీ నువ్వా-నేనా అన్న స్థాయిలో నెలకొంది.

Updated Date - Oct 29 , 2026 | 02:53 AM