తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన.. విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:41 AM
పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అనంతరం భీమవరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
పశ్చిమగోదావరి, అక్టోబర్ 29: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడంపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టి సారించారు. జిల్లాలో తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటించారు. అనంతరం భీమవరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తుపాను ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన పరిస్థితులు, దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
తుఫాన్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 3,700 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత రాత్రి నుంచి దాదాపు 400 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సరఫరా నిలిచిపోయిన గ్రామాల్లో పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రంలోగా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అవసరమైన సిబ్బంది, సామగ్రిని వినియోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News