Share News

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:04 AM

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ముఖ్యంగా సీనియర్‌ ఐఏఎ్‌సలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌
Jayesh Ranjan

  • మెట్రోపాలిటన్‌ ఏరియా శాఖ నుంచి తప్పించి అటవీ శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం

  • వీఆర్‌ఎస్‌ తీసుకుంటారన్న వార్తల వల్లే వేటు?

  • రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీలు

  • విద్యుత్తు శాఖ స్పెషల్‌ సీఎస్‌గా వికాస్‌రాజ్‌

  • సర్ఫరాజ్‌కు అదనంగా ‘మెట్రోపాలిటన్‌’

  • ‘గిరిజన సంక్షేమం’ నుంచి సవ్యసాచి ఔట్‌

  • సెలవులో వెళ్లనున్న జయేశ్‌ రంజన్‌!

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ముఖ్యంగా సీనియర్‌ ఐఏఎ్‌సలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకోవాలనుకుంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ను కూడా బదిలీ చేసింది. పైగా, ఆయనను కీలకమైన మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ నుంచి తప్పించి.. అంతగా ప్రాధాన్యం లేని అటవీ, పర్యావరణ శాఖకు మార్చింది. ఇక ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న దానకిశోర్‌ను గవర్నర్‌ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్‌ సంజయ్‌ జాజు జారీ చేశారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్‌ ఐఏఎస్‌ కె.రామకృష్ణారావు తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించి, అది దక్కకపోవడంతో వీఆర్‌ఎస్‌ తీసుకోవాలనుకుంటున్నట్లు భావిస్తున్న జయేశ్‌ రంజన్‌ను ఈ కీలక సమయంలో ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం.


జీహెచ్‌ఎంసీని విభజించి.. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రింగు రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలోకి తెస్తూ.. మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (హెచ్‌ఎండీఏ లిమిట్స్‌) శాఖను ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ లిమిట్స్‌లో పారిశ్రామిక పార్కులు, రింగు రోడ్డు లోపల రెసిడెన్షియల్‌ జోన్లు వంటి వాటిని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చేపట్టే అవకాశాలున్నాయి. ఇలాంటి కీలక కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో.. మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖను కొత్తగా ఏర్పాటు చేసి, పట్టణాభివృద్ధిపై అనుభవం, పరిజ్ఞానం ఉన్న జయేశ్‌ రంజన్‌ను ఏరికోరి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పైగా.. డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించనుంది.


ఈ సదస్సులో విదేశీ సంస్థలతో సమన్వయం చేయడం, ఎంవోయూల రూపకల్పనలో జయేశ్‌ రంజన్‌ కీలక భూమిక పోషించాల్సి ఉంది. గతేడాది నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్‌’ గ్లోబల్‌ సమ్మిట్‌లో కూడా ఆయన అంతా తానై కీలక పాత్ర పోషించారు. ఇలా ప్రభుత్వానికి అన్ని రకాలుగా పనికొచ్చే సీనియర్‌ అధికారిని అప్రాధాన్య శాఖకు బదిలీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకోబోతున్నారన్న కారణంతోనే బదిలీ చేసిందా.. అన్న చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఆయనను అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం.. ఇదే శాఖ పరిధిలో ఉండే పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.


పంచాయతీరాజ్‌ శాఖకు నవీన్‌ మిట్టల్‌..

1992 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికా్‌సరాజ్‌ను బదిలీ చేసి, కీలకమైన విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న నవీన్‌ మిట్టల్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇక రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌కు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హెరిటేజ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ అదనపు బాధ్యతలు చూసిన జయేశ్‌ రంజన్‌ను రిలీవ్‌ చేసింది. కాగా, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న శైలజా రామయ్యర్‌ను బదిలీ చేసి, దేవాదాయ(రెవెన్యూ) శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.


రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ అదనపు బాధ్యతలు చూసిన సవ్యసాచి ఘోష్‌ను రిలీవ్‌ చేసింది. మరోవైపు రాహుల్‌ బొజ్జాను బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశించింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఇళంబర్తిని రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా నియమించింది. రవాణా శాఖ కమిషనర్‌గా, పశు సంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ఇళంబర్తికి అప్పగించింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల స్పెషలాఫీసర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలను జయేశ్‌ రంజన్‌ చూసేవారు. ఇక మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్రుతి ఓఝాను నియమించింది. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎండీ ముషార్రఫ్‌ అలీ ఫారూఖీని బదిలీ చేసి.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించింది.


ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ చైర్మన్‌, ఎండీ అదనపు బాధ్యతలను కూడా ముషార్రఫ్‌ అలీకి అప్పగించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణను బదిలీ చేసి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమించింది. టీజీఎ్‌సపీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌కు టీజీ రెడ్కో వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిశోర్‌ను ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి దానకిశోర్‌ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఇప్పటివరకు ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఆయన పదవీ విరమణ దృష్ట్యా.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను ప్రభుత్వం నవీన్‌ మిట్టల్‌కు అప్పగించింది. దానకిశోర్‌ సేవలను కొనసాగిస్తూ.. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.


సెలవులోకి జయేశ్‌ రంజన్‌!

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ నవంబరు 1 నుంచి సెలవులోకి వెళ్లనున్నట్లు తెలిసింది. పట్టణాభివృద్ధి, క్రీడల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జయేశ్‌ రంజన్‌ను ప్రభుత్వం బుధవారం అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు బదిలీ చేయగా.. ఈ పదవిలో చేరకుండానే ఆయన సెలవుపై వెళ్లనున్నట్టు సమాచారం. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కకపోవడంపై నిరాశతో ఉన్న జయేశ్‌ ఇప్పటికే స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి అవకాశాలు రావడంతో ఆ దిశగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వీఆర్‌ఎస్‌ అనుమతి లభించిన వెంటనే ఆయన ప్రభుత్వ అత్యున్నత సర్వీసును వీడనున్నారు. ఇంకా 11 నెలల సర్వీసు ఉండగానే ఐఏఎస్‌ పదవిని వీడుతున్న జయేశ్‌.. దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్‌లో కీలక స్థానంలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది. దీంతో జయేశ్‌ రంజన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎండకు గలగల.. వానకు వలవల

ఎల్‌నినో ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేదు

మంత్రులకు పట్టభద్రుల పరీక్ష

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:04 AM