ఎండకు గలగల.. వానకు వలవల
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:44 AM
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో అసలే ఎండుతూ పండుతున్న పంటలను ఆర్నబ్ తుఫాను మరింత దెబ్బతీసింది. వర్షాలు, ఈదురుగాలులతో చాలాచోట్ల కోతకొచ్చిన వరిపంట నేలవాలింది. పత్తి పంట చేలల్లోనే తడిసిపోయింది.
తెలంగాణపై పడిన ఆర్నబ్ తుఫాను ప్రభావం
మొన్నటివరకు ఎల్‌నినోతో ఎండిన పంటలు
తాజాగా వర్షం, గాలులతో చేతికొచ్చిన పంట నీటిపాలు
ఉమ్మడి ఖమ్మం, న ల్లగొండ, వరంగల్ జిల్లాలపై ప్రభావం
చేలల్లోనే తడిసి రంగుమారుతున్న పత్తి
కోతకొచ్చిన వరి పంట నేలవాలటంతో రైతుల్లో ఆందోళన
నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో అసలే ఎండుతూ పండుతున్న పంటలను ఆర్నబ్ తుఫాను మరింత దెబ్బతీసింది. వర్షాలు, ఈదురుగాలులతో చాలాచోట్ల కోతకొచ్చిన వరిపంట నేలవాలింది. పత్తి పంట చేలల్లోనే తడిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న ఆర్నబ్ తుఫాను బుధవారం తెలంగాణపై కూడా ప్రభావం చూపింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబరు మొదటివారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పంటలు నీటిపాలు..
ఆర్నబ్ తుఫాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్రంగానే పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం ఈదురు గాలులతో రోజంతా ముసురు కురిసింది. దీంతో చేలల్లో ఏరటానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసిపోయింది. పత్తి నల్లబడి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, తల్లాడ, కొణిజర్ల, ఏన్కూరు తదితర మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. ఒక్క కల్లూరు మండలంలోనే సుమారు 8 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. మిర్చి, కూరగాయ పంటలకు మాత్రం ఈ వర్షం లాభం చేకూర్చిందని రైతులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా చేతికొచ్చిన వరిపంట నేలవాలింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నేరేడుచర్ల, మఠంపల్లి, పాలకవీడు, చింతలపాలెం, పెన్‌పహాడ్ తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి కొంతమేర తడిచాయి. తుఫాను భయంతో రైతులు వరికోతలు వేగవంతం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బుధవారం పలుచోట్ల ముసురు కురిసింది. చల్లని ఈదురుగాలులు వీయటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంపై కూడా బుధవారం ఆర్నబ్ తుఫాను ప్రభావం కనిపించింది.
వర్షం కురవకపోయినా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 13-15 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. మరో రెండురోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. తుఫాను కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం 35 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మంగళవారం కూడా పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. రైళ్ల రాకపోకలపై కూడా తుఫాను ప్రభావం పడింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో మంగళవారం 11 రైళ్లను రద్దుచేయగా, బుధవారం మరో 16 రైళ్లు రద్దయ్యాయి. ఐదు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. గురువారం నుంచి అన్ని రైళ్లను యథాతథంగా నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. రైళ్ల రాకపోకల సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్‌లను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు
కేటీఆర్ నాపై ట్రోల్ చేయిస్తున్నారు
విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News