Share News

ఎల్‌నినో ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేదు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:49 AM

సింకు దగ్గర నిలబడి నీళ్ల పంపు తిప్పి.. తీరిగ్గా పళ్లు తోమే అలవాటుందా? బాత్‌రూమ్‌లో షవర్‌ ఆన్‌ చేసి కూనిరాగాలు తీస్తూ ఎక్కువసేపు స్నానం చేస్తారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త..

ఎల్‌నినో ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేదు
El Nino Impact

  • డిసెంబరు వరకూ సింగూరు జలాలు..

  • అవసరమైతే కృష్ణా, గోదావరి నుంచి..

  • ఇతర అవసరాలకు మాత్రం కొరత ఉండే ప్రమాదం

  • నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాల్సిందే

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సింకు దగ్గర నిలబడి నీళ్ల పంపు తిప్పి.. తీరిగ్గా పళ్లు తోమే అలవాటుందా? బాత్‌రూమ్‌లో షవర్‌ ఆన్‌ చేసి కూనిరాగాలు తీస్తూ ఎక్కువసేపు స్నానం చేస్తారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇదే తీరు కొనసాగిస్తే.. ఎల్‌నినో దెబ్బకు మరికొన్ని రోజుల్లో నిత్యావసరాలకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జలాశయాల్లో నీళ్లు తక్కువగా ఉన్నాయి. అసలే నీటి కొరతకు కేరాఫ్‌ చిరునామా అయిన హైదరాబాద్‌పై ఈ ఎల్‌నినో ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది.


అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఉండవుగానీ.. ఇతరత్రా అవసరాలకు మాత్రం కటకటలాడే పరిస్థితి ఉండొచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మహా నగరానికి ప్రస్తుతం రోజుకు 2650మిలియన్‌ లీటర్ల నీటిని తీసుకొస్తున్నారు. అందులో 2వేల మిలియన్‌ లీటర్లు కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీరే. అయితే.. నిరుటితో పోల్చితే నాగార్జునసాగర్‌లో నీటిమట్టాలు గణనీయంగా తగ్గాయి. అక్కడ డెడ్‌స్టోరేజీ నుంచి కూడా నీళ్లు నగరానికి తీసుకునే వెసులుబాటు ఉన్నది. తాగునీటి కోసం ఎన్ని నీళ్లనైనా వినియోగించుకోవచ్చు అయితే నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ప్రస్తుతం 537అడుగుల దాకా ఉండగా.. 510 అడుగులకు తగ్గగానే అత్యవసర పంపింగ్‌ ప్రారంభించాల్సి ఉంటుంది.


నీటిమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో అత్యవసర పంపింగ్‌కు వాటర్‌బోర్డు 2 నెలల్లో సన్నద్ధమయ్యేందుకు అవకాశాలున్నాయి. ఇక.. సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 523మీటర్లు కాగా.. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 514 మీటర్ల మేర నీళ్లున్నాయి. నెల రోజులుగా అత్యవసర పంపింగ్‌ ద్వారా నగరానికి సింగూరు జలాలు తీసుకొస్తున్నారు. ఈ జలాలు మరో 70 రోజుల దాకా నగరానికి రానున్నాయి. సింగూరులో నీటిమట్టం 510 మీటర్లకు చేరగానే నగరానికి ఆ జలాలు దాదాపు 300 మిలియన్‌ లీటర్ల మేర నిలిచిపోతాయి. అదే జరిగితే.. షేక్‌పేట్‌, బోరబండ రిజర్వాయర్‌, లింగంపల్లి రిజర్వాయర్‌ ప్రాంతాలకు, ఖానాపూర్‌ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్‌ ఆన్‌లైన్‌ సప్లయ్‌ ప్రాంతాలకు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌ రిజర్వాయర్ల ప్రాంతాలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.


కృష్ణా, గోదావరి జలాల సర్దుబాటు

నగరానికి సింగూరు జలాలు నిలిచిపోయే అవకాశాలుండడంతో వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కృష్ణా జలాలను ప్రస్తుతం సైనిక్‌పూరి వరకు అందిస్తుండగా, ఆ తర్వాత ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. సైనిక్‌పురి తర్వాత కొన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను నిలిపివేసి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. గోదావరి నుంచి అదనంగా 75 మిలియన్‌ లీటర్ల నీరు తెచ్చి.. సింగూరు, మంజీర నీళ్లు సరఫరా జరిగే ప్రాంతాలకు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. జంట జలాశయాలైనా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి కంటే అధికంగా వినియోగించడానికి చర్యలు చేపట్టారు.


తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం

నగరానికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేవు. సింగూరు జలాలు ఒక వేళ నిలిచిన ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. గతంలో బెంగుళూర్‌లో తలెత్తిన పరిస్థితులు హైదరాబాద్‌లో రావు. జలాశయాల్లో చివరి బొట్టు కూడా నగర తాగునీటి అవసరాలకు వినియోగించడానికి ప్రణాళికలున్నాయి. ఎల్‌నినో నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలి. ప్రతి ఇంట్లో కనీసం 20శాతం నీటి వినియోగాన్ని తగ్గించాలి. నీటిని పొదుపుగా, బాధ్యతాయుతంగా వినియోగించాలి.

- అశోక్‌ రెడ్డి, ఎండీ, వాటర్‌ బోర్డు


ఈ వార్తలు కూడా చదవండి:

ఎండకు గలగల.. వానకు వలవల

కేటీఆర్‌ నాపై ట్రోల్‌ చేయిస్తున్నారు

విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 04:49 AM