ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:12 AM
కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించాక.. అందులో కొందరిని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఇంటర్ విద్యాశాఖ తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ నియామకాలు రద్దు చేయడం సరికాదు
వారు కాంట్రాక్టు విధానంలో, రెగ్యులర్ సర్వీసులో పదేళ్లకుపైగా పనిచేశారు
ఇంటర్ విద్యాశాఖకు స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించాక.. అందులో కొందరిని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఇంటర్ విద్యాశాఖ తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వివరణ తీసుకోకుండా, ఎలాంటి విచారణ చేపట్టకుండా నియామకాలను రద్దు చేయడం సరికాదని స్పష్టం చేసింది. సదరు లెక్చరర్లు కాంట్రాక్టు విధానంలో, తర్వాత రెగ్యులర్‌గా పదేళ్లకుపైగా పనిచేశారని గుర్తు చేసింది. కావాలంటే వారిపై శాఖాపరమైన విచారణ జరిపి, చర్యలు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. 2023 మే 3న సుమారు 3వేల మందికిపైగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే అందులో కొందరు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని తేలిందంటూ వారి నియామకాలను (అపాయింట్‌మెంట్‌ను) రద్దు చేస్తూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ ఈ నెల (అక్టోబర్) 1న ఉత్తర్వులు జారీ చేశారు.
తమను ఇలా ఏకపక్షంగా తొలగించడం చెల్లదంటూ 35 మంది జూనియర్ లెక్చరర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.శరత్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎం.సురేందర్‌రావు, జీవీఎల్ మూర్తి, ఎం.శ్రీనివాసరావు, ఎన్.రమేశ్ వాదనలు వినిపించారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించిన సమయంలో.. యూనివర్సిటీల నుంచి తమ సర్టిఫికెట్లు అసలైనవేంటూ లేఖలు తెచ్చి ప్రభుత్వానికి సమర్పించారని ధర్మాసనానికి వివరించారు. వాటిని అంగీకరించిన ప్రభుత్వం సర్వీసును క్రమబద్ధీకరించిందని తెలిపారు. తర్వాత తమ సర్టిఫికెట్లు నకిలీ అంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని.. నిజానికి యూనివర్సిటీలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో నిజం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991లోని రూల్ 20 ప్రకారం.. అన్ని డాక్యుమెంట్లు అందజేసి విచారణ జరపాల్సి ఉందని, కానీ తమకు వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగింపు ఉత్తర్వులు జారీచేశారని కోర్టుకు వివరించారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘సర్టిఫికెట్లు వెరిఫికేషన్, ఇతర షరతులకు లోబడి ఉంటుందని అపాయింట్‌మెంట్ నియామక ఉత్తర్వుల్లో ఉంది. ఇంటర్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) కార్యాలయ సిబ్బంది స్వయంగా ఆయా యూనివర్సిటీలకు వెళ్లి పరిశీలన జరిపారు. అక్కడ పిటిషనర్ల రికార్డులు లేవని తేలిన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేశాం. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పొందిన ఉద్యోగం మొదటి నుంచే చెల్లదు’’ అని కోర్టుకు విన్నవించారు.
అలా చేస్తే ఉద్యోగులకు అవమానం..
వాదనలు విన్న ధర్మాసనం.. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ, నియామకాల అంశంలో ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ కాంపిటెంట్ అథారిటీ అని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులు జారీచేసినదీ, పిటిషనర్లు వివరణ ఇచ్చినదీ ఆర్జేడీకి మాత్రమేనని గుర్తు చేసింది. కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా నియామకాలను ఇంటర్ విద్య డైరెక్టర్ రద్దు జారీచేశారని పేర్కొంది. ఇది సరికాదని స్పష్టం చేసింది. ఆరోపణలతో ఉద్యోగి సర్వీసును కొనసాగించకపోతే ఉద్యోగికి అవమానకరమని.. వివరణ ఇచ్చే హక్కు ఉద్యోగికి ఉంటుందని తెలిపింది. ప్రాథమికంగా పరిశీలిస్తే పిటిషనర్ల వాదన వైపు మొగ్గు ఉందని పేర్కొంది. పిటిషనర్లను తొలగిస్తూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులపై మధ్యంతర సస్పెన్షన్ విధించింది. పిటిషనర్లను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News