దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:09 AM
రాష్ట్రంలో దీపావళి పండుగ తరువాత అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన జరగనుంది. సచివాలయం నుంచి మండల స్థాయి అధికారుల వరకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, తహసీల్దార్ల వరకు స్థానచలనం
పనితీరు నివేదికలే ప్రామాణికం
ఐటీకి కొత్తబాస్‌ను నియమించే చాన్స్
విద్య, వైద్య శాఖల్లోనూ కీలక మార్పులు
రాష్ట్రంలో 9వ తేదీతో ముగియనున్న సర్
తరువాత బదిలీలకు ముహుర్తం ఖరారు
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దీపావళి పండుగ తరువాత అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన జరగనుంది. సచివాలయం నుంచి మండల స్థాయి అధికారుల వరకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం చేపట్టిన సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు ట్రైలర్ మాత్రమేనని, దీపావళి తరువాత ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్‌లు, ఇతర అధికారుల బదిలీలు కూడా భారీగా జరగనున్నాయని సమాచారం. రాష్ట్ర స్థాయిలోని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల హోదా నుంచి జిల్లాల్లోని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, తహసీల్దార్‌ల వరకు స్థానచలనం కలగనుంది.
ఈసారి బదిలీల్లో ఆయా అధికారుల పనితీరు నివేదికలే కీలకం కానున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ నవంబరు 9తో ముగియనుంది. నవంబరు 8న దీపావళి పండుగ ఉంది. ఈ రెండూ ముగిసిన వెంటనే బదిలీలు చేపట్టేందుకు ముహుర్తం ఖరారైనట్లు అధికార వర్గాల సమాచారం. అయితే నవంబరు 3న కూడా బదిలీల జాబితా వచ్చే అవకాశం ఉందని సచివాలయంలోని పలు విభాగాల పేషీల్లో చర్చ జరుగుతోంది. దీపావళి, సర్ ప్రక్రియ ముగిశాకే బదిలీల జాబితా వస్తుందంటూ చర్చించుకుంటున్నారు.
సీఎంకు చేరిన పనితీరు నివేదికలు..
జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల పనితీరుకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి చేరాయని, వాటి ఆధారంగా అధికారులకు పోస్టింగ్‌లు ఉంటాయని సమాచారం. పనితీరు సరిగాలేని అధికారులను అవసరమైతే లూప్‌లైన్‌లో ఉంచాలని భావిస్తున్నట్టు ప్రభుత్వంలోని ముఖ్య వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు ఉంటాయని గతంలో నిర్వహించిన సమీక్షల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే ఈసారి బదిలీలకు ముందుగానే నివేదికలు తెప్పించినట్టు తెలిసింది. రెండేళ్లకు మించి ఉన్న అధికారులు, ఇటీవల బదిలీల్లో వెళ్లినవారు ఎవరున్నారనే అంశాలను పరిగణలోకి తీసుకుని, వాటి ప్రకారం ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. కాగా, నవంబరులో చేపట్టే బదిలీలతో ఆయా స్థానాలకు వెళ్లే అధికారులను రెండేళ్లపాటు కదిలించే అవకాశం ఉండదని అంటున్నారు. ఆ తరువాత మళ్లీ సాధారణ ఎన్నికల సమయానికే బదిలీలకు అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది.
ఐటీ శాఖకు కొత్త బాస్..
దీపావళి తరువాత జరగబోయే అధికారుల బదిలీల్లో ఐటీ, పరిశ్రమల శాఖకు కొత్త బాస్ వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన బదిలీల్లో ఓ అధికారిని ఐటీ శాఖకు నియమించగా.. సదరు అధికారి ఆ బాధ్యతలను స్వీకరించలేదు. దాంతో అప్పటి నుంచి ఐటీ, పరిశ్రమల శాఖ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నవారే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కూడా సీఎస్ సంజయ్‌జాజునే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బదిలీల్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు విద్య, వైద్య శాఖల్లోనూ మార్పులు చేయనున్నారు.
ప్రస్తుతం వైద్య శాఖ కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి ఆ స్థానంలోకి వచ్చి రెండున్నరేళ్లకు పైగా అవుతోందని, ఈసారి తమ శాఖకు కొత్త అధికారి వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖలో చర్చ నడుస్తోంది. మరోవైపు విద్యాశాఖలోనూ స్థానచలనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. దీంతో ఆ శాఖకు ఏ అధికారి అయితే బాగుంటుందన్న విషయంలోనూ చర్చ నడుస్తున్నట్టు తెలిసింది. రెవెన్యూ, సీసీఎల్‌ఏ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లోనూ అధికారులకు స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి. వ్యవసాయ శాఖలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా బదిలీల్లో ఎవరికి ఏ శాఖ వస్తుందనే దానిపై అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.
శాఖ మారేందుకు ఓ అధికారిణి ప్రయత్నాలు..
ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేయనుందన్న వార్తల నేపథ్యంలో పలువురు అధికారులు కీలక శాఖలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. తమకున్న పరిచయాలు, పలుకుబడిని ఇందుకు వాడుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ కీలక శాఖకు కార్యదర్శిగా ఉన్న ఓ అధికారిణి.. మరో శాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సంబంధిత శాఖలో చర్చ జరుగుతోంది. అయితే సదరు అధికారిణి వెళ్లాలనుకుంటున్న శాఖలో ప్రస్తుతం ఉన్న అధికారిణి గడచిన రెండున్నరేళ్లగా అక్కడే తిష్ట వేశారని, ఈసారి బదిలీల్లోనూ ఆమె అక్కడే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వెరసి ఈ రెండు విభాగాల్లోని అధికారుల బదిలీ అంశం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఎల్‌నినో ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News