మోస్ట్ వాంటెడ్ అంతర్ రాష్ట్ర ఘరానా హంతకుడు అరెస్ట్
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:50 PM
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి బంగారు నగలు దోచుకునే మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిని తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసును ఛేదిస్తూ, అంతర్ రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని హత్య చేసి నగలతో పరారవ్వడం నిందితుడికి అలవాటని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మారుపేర్లతో తిరుగుతున్నా నిందితుడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో కేరళంలో జరిగిన ఓ హత్య కేసులో శిక్ష పడిన తర్వాత పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని మారుపేర్లతో నిందితుడు తిరుగుతున్నాడు. కర్ణాటక, కేరళం రాష్ట్ర సరిహద్దు సులియా ప్రాంత నివాసి విశ్వనాథ్ @ ప్రశాంత్ @ అజీజ్‌గా గుర్తించామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన విశ్వనాధ్ ఆధార్ కార్డును అతని పేరు మీద మార్చుకుని నేరాలకు నిందితుడు పాల్పడుతున్నాడు. 2018లో కేరళం రాష్ట్రంలో హత్య కేసులో నిందితుడికి శిక్ష పడి పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ కోసం కేరళం పోలీసులు రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన ఒక వ్యక్తి ఆధార్ కార్డును తన పేరు మీద మార్చుకుని (ఫోర్జరీ చేసి) ఇన్ని రోజులు పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు.
తిరుపతిలో చేసిన నేరాలు..
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈ నిందితుడు నలుగురిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు హత్యలు చేసి బంగారు నగలను దోచుకున్నాడు. తిరుచానూరులో రెండు హత్యలు, రామచంద్రపురంలో ఒకటి, పిచ్చాటూరులో మరొక హత్య చేసి నగలు దోపిడి చేశాడని పోలీసులు తెలిపారు.
రికవరీ, అరెస్టులు..
నిందితుడి నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాల్లో నిందితుడికి సహకరించిన రాజమ్మ అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళం పోలీసులకు నిందితుడిని అప్పగిస్తాం: ఎస్పీ సుబ్బరాయుడు
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు వెల్లడించారు. నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని కేరళం పోలీసులకు అందజేస్తామని తెలిపారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్ రాష్ట్ర హంతకుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. నేరస్థులు తప్పుడు గుర్తింపు కార్డులతో తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..
చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత
జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి
Read Latest AP News And Telangana News And International News And Telugu News