చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:40 PM
తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తిరుపతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) నివాసంలో ఈరోజు(శుక్రవారం)ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలు కొన్ని గంటల పాటు కొనసాగాయి. ఈడీ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి వద్దే ఉండి సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది మంది ఈడీ అధికారులు, ఆరుగురు గన్‌మెన్లతో కూడిన బృందం ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో బెంగళూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, వైసీపీ చంద్రగిరి ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుమ్మలగుంట నివాసానికి చేరుకున్నారు.
కీలక పత్రాలు స్వాధీనం..
మోహిత్ రెడ్డి చేరుకున్న తర్వాత సుమారు 8 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు కొనసాగించారు. ఈ సమయంలో పలు కీలక పత్రాలను పరిశీలించారు. దాదాపు 60 పేజీల నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మోహిత్ రెడ్డి ఏమన్నారంటే..
ఈడీ సోదాలు ముగిసిన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని రికార్డులు, డాక్యుమెంట్లు అందజేశానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఒక్క మద్యం బాటిల్ కూడా పంపిణీ చేయలేదని స్పష్టం చేశారు. లిక్కర్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ‘న్యాయం మా వైపే ఉంది, నిర్దోషిగా బయటపడతాం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈడీ సంస్థపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థపై కూడా విశ్వాసం ఉందని మోహిత్ రెడ్డి తెలిపారు.
కేసు ప్రాధాన్యం..
ఈ సోదాలు లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో, రాజకీయంగా ఇది కీలక పరిణామంగా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈడీ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఈడీ దర్యాప్తు ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News