Share News

బ్రో... జాగ్రత్త..! సోషల్‌ మీడియాలో రెచ్చగొడితే జైలుకే

ABN , Publish Date - May 30 , 2026 | 12:25 PM

కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, మరికొంత మంది మతాలు, కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు.

బ్రో... జాగ్రత్త..! సోషల్‌ మీడియాలో రెచ్చగొడితే జైలుకే
Social Media

  • తొలుత బైండోవర్‌, రెండోసారి జరిమానా, కేసు

  • సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా

  • మొదటిరౌండ్‌లో బైండోవర్లు ప్రారంభం

హిందూపురం(శ్రీ సత్యసాయి): కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, మరికొంత మంది మతాలు, కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఈ పోస్టులు, ఈ వ్యాఖ్యలు ఎవరూ చూడలేదు కదా అని వారనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా, చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎస్పీ ఓ ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేశారు. వారు నిత్యం ఇలాంటి వాటిపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టును గుర్తించి ఎవరు పెట్టారనే దానిపై ఆరాతీసి వారిని జిల్లా కేంద్రానికి పిలిపించుకుని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మొదటి విడతలో రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టిన వారితోపాటు మతాలు, కులాలమధ్య రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఏ కేటగిరి కింద 50మంది వరకు ఉన్నట్లు సమాచారం.


సోషల్‌ మీడియాపై పోలీసుల నిఘా

చేతిలో ఫోన్‌ ఉందికదా అని ఎవరో వాట్సాప్‌ లేదా ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్‌ చేసిన దానిని ఫార్వర్డ్‌ చేయడం కొందరికి సర్వసాధారణమైంది. అయితే కొన్ని పోస్టులు సమాజంలో ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకున్న జిల్లా ఎస్పీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, ఇలాంటి పోస్టుల నియంత్రణకు జిల్లా కేంద్రంలో ఒక సోషల్‌ మీడియా వింగును ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో ఉన్న నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు చట్టవ్యతిరేక పోస్టులను పెట్టేవారి గురించి జిల్లా కేంద్రానికి సమాచారం అందిస్తోంది. ఇది తెలుసుకోకుండా సమాజంలో అశాంతి కలిగేలా పోస్టులు పెట్టేవారు, ఫార్వర్డ్‌ చేసేవారు జైలుకెళ్లాల్సిందే.


  • కొన్ని నెలల కిందట హిందూపురంలో ఒకరిద్దరు యువకులు ఓ పోస్టు ఫొటోను క్రియేట్‌ చేసి ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దానిని చూసిన ఆ వర్గం ఆగ్రహంతో సోషల్‌ మీడియా వేదికగానే ప్రశ్నించారు. దీనిపై ఇరు వర్గాలు కవ్వించేలా వ్యవహరిస్తుండటంతో ఎస్పీ అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

  • కొన్ని రోజుల కిందట ధర్మవరంలో సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌ అయ్యి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు కాబట్టి వివాదం సద్దుమణిగింది.


pandu1.2.jpg

  • మూడు నెలల కిందట హిందూపురంలో ఓ పార్టీకి చెందిన వారు మరో పార్టీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవతలపార్టీ నాయకులు పెద్దగా స్పందించకపోవడంతో సరిపోయింది. లేదంటే పరిస్థితి చేజారేది.

  • కొన్ని రోజుల కిందట హిందూపురంలోని ఓ వైసీపీ కార్యకర్త పలుమార్లు సోషల్‌ మీడియాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యేపై పోస్టులు పెడుతూ వచ్చారు. కానీ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. పది రోజుల కిందట జనసేన నాయకులు ఆ విషయాన్ని పైస్థాయికి తీసుకెళ్లారు. దీంతో ఆ వైసీపీ కార్యకర్తను పిలిపించి పోలీసులు మందలించారు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా చాలానే ఉన్నాయి.


xxx.jpgమొదటిసారి బైండోవర్‌

జిల్లాలో పలుమార్లు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినవారిని పార్టీలకు అతీతంగా గుర్తించారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు చెందినవారు ఉన్నారు. మొదటి విడత కింద 50మందిదాకా గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 20మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిసింది. మొదటిసారి బైండోవర్‌ చేస్తారు. అదికూడా రూ.5లక్షల పూచికత్తుతో ఉంటుంది. ఒకవేళ బైండోవర్‌ అయిన తరువాత కూడా రెచ్చగొట్టే పోస్టులు పెడితే, బైండోవర్‌ నిబంధనలు అతిక్రమించినందుకు రూ.5లక్షలు జరిమానా, జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంది. జిల్లాలో ఇలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు. పలుమార్లు పోలీసులు హెచ్చరించినా తీరు మార్చుకోకుండా పోస్టులు పెట్టినవారిని గుర్తిస్తూ వస్తున్నారు. మొదట ఏ కేటగిరీరి, తరువాత బి, సి, డి కేటగిరీలుగా విభజించి వారిని బైండోవర్‌ చేస్తూ వెళ్తారు.


రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులే

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదుచేసి జైలుకు పంపుతాం. పోలీసులు హెచ్చరించినా వినకుండా మళ్లీ పోస్టులు పెట్టినవారిని ఏ కేటగిరీగా గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చి బైండోవర్‌ చేయడం ప్రారంభించాం. నాలుగు రోజుల కిందటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. జిల్లా వ్యాప్తంగా ఏ కేటగిరీ వారు 50మంది ఉన్నట్లు గుర్తించాం. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్‌ చేసేవారిని విడతల వారీగా బైండోవర్‌ చేస్తాం. రెండోసారి చేస్తే రూ.5లక్షలు జరిమానాతోపాటు జైలుకు వెళ్లాల్సిందే.

  • సతీష్‌కుమార్‌, జిల్లా ఎస్పీ


ఈ వార్తలు కూడా చదవండి:

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 30 , 2026 | 12:31 PM