Share News

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

ABN , Publish Date - May 30 , 2026 | 10:16 AM

లింగంపల్లి ఆర్‌ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక అంచనా వ్యయానికి అనుమతులు వచ్చాయి.

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

  • రూ.133 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

  • జూన్‌ 2 లేదా 3న శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: లింగంపల్లి ఆర్‌ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక అంచనా వ్యయానికి అనుమతులు వచ్చాయి. గత అంచనా వ్యయం రూ.127కోట్లు ఉండగా తాజాగా రూ.133కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పనుల ప్రారంభానికి అడ్డంకి తొలగిపోయింది. ఎన్నో ఎళ్లుగా ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయితే స్థానికులతో పాటు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వేలాది మందికి ట్రాఫిక్‌ సమస్య నుంచి ఊరట లభించనుంది.


అధికారుల నిర్లక్ష్యంతోనే జాప్యం..

అధికారుల నిర్లక్ష్యంతో లింగంపల్లి ఆర్‌ఓబీ పనుల్లో జాప్యం జరిగింది. వాస్తవానికి పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. నియోజకవర్గంలోని పలు ఫ్లైఓవర్లు, అండర్‌బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నా లింగంపల్లి ఆర్‌ఓబీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి అధికారుల తీరే కారణమని తెలుస్తుంది. వంతెన ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మించాలో స్పష్టత లేకపోవడంతో ఆలస్యం జరిగినట్లు సమాచారం. దీంతో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. పోలీసుల సలహాలు, సూచనలు మేరకు అంచనాలు పెరగడం, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు.


city3.jpgకొంతమంది అధికారులు, స్థానిక నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వం పనులు చేయాల్సిందిగా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. దీంతో అధికారులు వేగంగా నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించనున్నారు. అయితే రోడ్డు విస్తరణ పనులపై అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆస్తులు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లింపు విషయంలో శేరిలింగంపల్లి, మియాపూర్‌ సర్కిల్స్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా స్థానికుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసి పనులు చేయాల్సి ఉంది. త్వరగా పనులు ప్రారంభించి పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.


2 లేదా 3న పనులు ప్రారంభిస్తాం

లింగంపల్లి ఆర్‌ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పలుమార్లు ప్రణాళికలు మార్చడం వల్ల నిధులు వ్యయం పెరిగి ఆలస్యమైంది. ప్రస్తుతం రూ.133కోట్లతో పనులు జరగనున్నాయి. జూన్‌ 2, 3 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మియాపూర్‌ ఆల్విన్‌కాలనీ అండర్‌పాస్‌ నిర్మాణ పనులకు కూడా అదే రోజు శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

  • ఈఈ నాయక్‌, ప్రాజెక్టు సీఎంసీ


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 30 , 2026 | 10:16 AM