15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే
ABN , Publish Date - May 30 , 2026 | 04:31 AM
రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9శాతం మంది.. మహిళల్లో 7.1 శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే....
మహిళల్లో 7.1 శాతం.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
62.2శాతం సి-సెక్షన్ ప్రసవాలతో దక్షిణాదిన అగ్రస్థానంలో తెలంగాణ
రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు 84శాతం సిజేరియన్ ప్రసవాలే
తగ్గిన బాల్యవివాహాలు.. 30.8శాతం మంది స్త్రీలకు గృహహింస
పెరిగిన వృద్ధుల సంఖ్య.. 60 ఏళ్లకు పైబడిన వారు 14.1 శాతం
న్యూఢిల్లీ, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9శాతం మంది.. మహిళల్లో 7.1 శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 2023-24 నివేదికలో వెల్లడైంది. దాని ప్రకారం.. దేశంలో సిజేరియన్ ప్రసవాలు అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే జరుగుతుండగా.. వాటిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గతంలో ఉన్న 60.7 శాతం నుంచి 62.2 శాతానికి పెరిగింది (జాతీయ సగటు 27.2 శాతం). ఇక.. 52.2శాతం సిజేరియన్ ప్రసవాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఆ నివేదిక ప్రకారం..
రాష్ట్రంలో 98.8 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 83.9శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. అందునా.. పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల (82.9శాతం) కంటే గ్రామీణ ప్రాంత ప్రైవేటు ఆస్పత్రుల్లోనే (84.9శాతం) ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి.
రాష్ట్ర జనాభాలో ఐదేళ్ల లోపు పిల్లలు 7.1శాతం.. 15 ఏళ్ల లోపు పిల్లలు 21.3శాతం మంది ఉన్నారు.
12-23 నెలల వయసున్న పిల్లల్లో 80.9 శాతం మందికి పూర్తిస్థాయిలో టీకాలు వేశారు.
రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు 14.1 శాతం మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సంఖ్య 14.9 శాతం కాగా, పట్టణాలలో వీరు 11.9శాతం మంది ఉన్నారు. గత నివేదిక ప్రకారం వీరి సంఖ్య రాష్ట్రంలో 12.7 శాతం.
రాష్ట్రంలో 98.6శాతం ఇళ్లకు విద్యుత్, 98.2శాతం కుటుంబాలకు మెరుగైన తాగునీటి సౌకర్యం ఉన్నాయి.
82.2శాతం కుటుంబాలకు ఏదో ఒక ఆరోగ్య బీమా లేదా ఫైనాన్సింగ్ పథకం వర్తిస్తోంది. గతంలో ఇది 69.2 శాతమే.
31.1శాతం మహిళలు సొంతంగా లేదా ఉమ్మడిగా ఇల్లు/భూమి కలిగి ఉన్నారు. గతంలో వీరి సంఖ్య 22.3శాతం మాత్రమే.
పదేళ్లకు పైగా చదువుకున్న వారిలో మహిళలు 51.1శాతం కాగా, పురుషులు 65శాతం మంది ఉన్నారు.
64.8శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. గతంలో ఇది కేవలం 26.5 శాతంగానే ఉంది. పురుషులు 87.3ు మంది ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. గతంలో ఈ సంఖ్య 50 శాతమే.
రాష్ట్రంలోని మహిళల్లో 72.5శాతం మంది సొంత మొబైల్ ఫోన్ వాడుతున్నారు. 89.9శాతం మంది కుటుంబ నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నారు.
20-24 ఏళ్ల మహిళల్లో 18 ఏళ్లలోపే పెళ్లయిన వారు 17.9 శాతం మంది. గతంలో వీరి సంఖ్య 23.5 శాతంగా ఉండేది.
25-29 ఏళ్ల పురుషులలో 21 ఏళ్లలోపు పెళ్లయినవారు 5.7శాతం గతంలో వీరి సంఖ్య 16.3 శాతం.
మహిళల్లో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదైంది. 62.5శాతం మంది కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు.
18-49 ఏళ్ల మధ్య గల వివాహిత మహిళల్లో 30.8 శాతం మంది గృహహింసను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో 19.6శాతం మంది మధుమేహంతో బాధపడుతూ మందులు తీసుకుంటున్నారు. పురుషుల్లో ఈ సంఖ్య 24.5శాతం. ఇక.. అధిక రక్తపోటుతో 24.2శాతం మంది మహిళలు, 28.2శాతం మంది పురుషులు బాధపడుతున్నారు.