పలు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ విడుదల..
ABN , Publish Date - May 30 , 2026 | 11:36 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కోహెడలో 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మించనుంది. ఆ తర్వాత అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేయనున్నారు. జూన్ 4న జూరాల, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. నార్లాపూర్, వట్టేం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సంఘాలకు బస్సులను రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. రూ.199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులను మహిళలకు అందించనున్నారు. కాగా, మహిళా సంఘాలకు బస్సులు అందించి, వాటిని తెలంగాణ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం!
పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ షాకింగ్ నిర్ణయం..