మోదీని రాహుల్ జయించగలడా?
ABN , Publish Date - May 30 , 2026 | 03:15 AM
గత సార్వత్రక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకు యువ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒకరు నాకు తటస్థించారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీకి ఐదు సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. నేను ఇవ్వగల సలహా ఒక్కటే...
గత సార్వత్రక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకు యువ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒకరు నాకు తటస్థించారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీకి ఐదు సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. నేను ఇవ్వగల సలహా ఒక్కటే ఉన్నదని చెప్పాను: వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రియాంకగాంధీ పోటీ చేయకూడదు. నా యీ సలహాను నిర్లక్ష్యం చేస్తారని నిశ్చితంగా చెప్పగలను అని ముక్తాయించాను.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఆయన నాయకత్వం పట్ల విశ్వసనీయతను పెంపొందించిందనడంలో సందేహం లేదు. ఆ యాత్రతో ఆయన ప్రజల మనిషిగా భాసించారు. అయితే సార్వత్రక ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ను మళ్లీ ఒక కుటుంబ జమీగా అయిపోవడంతో భారత్ జోడో యాత్ర సత్ఫలితాలు వ్యర్థమైపోయాయి. ప్రియాంకగాంధీ వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాను దక్షిణాదికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తన సోదరుడు ఉత్తరాదికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, తద్వారా తాము ఈ సువిశాల దేశాన్ని సమైక్యం చేస్తున్నామని ప్రియాంక వాగాడంబరం ప్రదర్శించారు.
2024 సార్వత్రక ఎన్నికలలో 99 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించడంతో రాహుల్ విధేయులు ఆయనను ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి అని కీర్తించడం ప్రారంభించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధావులు, పాత్రికేయులు కూడా ఆ కీర్తనతో ఏకీభవించారు. రెండు సంవత్సరాల తరువాత వెనుతిరిగి చూస్తే వారి ఆనందోత్సాహాలు తొందరపాటుతో కూడుకున్నవని అనిపిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క రాష్ట్రం– కేరళ–లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ క్రమంగా వెనుకపడిపోతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాలో బీజేపీ స్వతస్సిద్ధ పాలకపక్షంగా భాసిల్లుతోంది. కాంగ్రెస్ పతనాన్ని రాహుల్‌గాంధీ నిలువరించలేకపోతున్నారు. 2008లో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆయన లాంఛనంగా చేపట్టినప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 1204 నుంచి ఇప్పుడు 676కి పడిపోయింది.
రాహుల్‌గాంధీని స్వయంగా కలిసి మాటా మంతీ జరిపాను. ఆయనతో నేను ఉత్తర ప్రత్యుత్తురాలూ సాగించాను. జవహర్‌లాల్ నెహ్రూ మునిమనవడు సద్వర్తనుడు, సందేహం లేదు. ఈ కొద్ది పాటి పరిచయం కూడా లేకపోయినప్పటికీ ఆయన పట్ల నాకు అపార సానుభూతి ఉండేది. ఆయన లోనైన వ్యక్తిగత విషాదాలే ఆ సానుభూతిని కలిగించాయి. యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న రాహుల్ తన తల్లి సంకల్పసాధనకు ఒక సాధనంగా మిగిలిపోయాడు. సోనియాగాంధీ ఆదేశం మేరకే ఆయన రాజకీయాలలో ప్రవేశించారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఆమె చెప్పిన విధంగానే కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తున్నారు. అయితే మన గణతంత్ర రాజ్యం మౌలిక విలువలు, మనుగడ ప్రమాదంలో పడిన ప్రస్తుత సందర్భంలో ప్రజాచర్చ మారాలి. అది స్పష్టంగా, కఠినంగానే కాకుండా క్రూరంగా కూడా జరగాలి. రాహుల్‌గాంధీ మంచి మనిషి, ఉత్తమ భారతీయుడే. అయితే బీజేపీ విద్వేషపాలనను అంతమొందించేందుకు ఆరాటపడుతున్నవారు తమ ప్రధాన ఆశాజ్యోతిగా రాహుల్‌ను చూడడాన్ని మానుకోవడం మంచిది.
ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి భావి సవాల్‌దారు అయిన రాహుల్‌లో క్రమశిక్షణ, హుందాతనం, విద్యార్హతలు, నాయకత్వ నైపుణ్యాలు కొరవడ్డాయి. ఎన్నికల సంఘం పక్షపాత కార్యసరళి లాంటి సమస్యపై కూడా ఆయన నిర్విరామంగా పోరాడలేదు. ‘ఓటు చోరీ’పై ఒకరోజు విలేఖర్ల సమావేశంలో పాల్గొని, మరుసటి రోజే యూరోప్ లేదా లాటిన్ అమెరికాకు వెళ్లిపోవడాన్నే దేశ ప్రజలు చూశారు. తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత్ జోడో యాత్ర చేసిన కొద్ది నెలలు మాత్రమే ప్రజాసమస్యలపై ఆయన తదేక దీక్షతో శ్రద్ధ చూపడం జరిగింది. బీజేపీ నాయకులు అటువంటి దీక్షతో 365 రోజులూ రేయింబవళ్లు పనిచేస్తుంటారు. ఈ రోజుల్లో ఆయన తన రాజకీయ కార్యకలాపాలను చాలావరకు సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఆయన పోస్ట్‌లకు వెన్వెంటనే లైక్‌లు వెల్లువెత్తుతాయి. అయితే ఆయన వ్యాఖ్యలు 24 గంటలలోపే పూర్తిగా విస్మృతమయిపోతున్నాయి! 2004లో లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికవక ముందు రాహుల్ ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చేశారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. యూపీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో మంత్రిపదవిని చేపట్టేందుకు ఆయన అంగీకరించలేదు. మరి ఆయన ప్రస్తుత కల్లోల అంతర్జాతీయ పరిస్థితులలో ఈ సువిశాల దేశానికి ప్రభావశీల ప్రధానమంత్రి కాగలరని భారతీయ ఓటర్లు ఎందుకు విశ్వసించాలి? గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేని చేతకానితనం రాహుల్‌కు ఉన్నది. 2019లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ నిర్వహించిన ‘చౌకీదార్ చోర్’ ప్రచారం ఘోరంగా విఫలమవడమే కాకుండా కాంగ్రెస్‌నే ఎదురు దెబ్బతీసింది. అయినప్పటికీ పాలనా వైఫల్యాలు లేదా తన సొంత పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టకుండా ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని రాహుల్ కొనసాగిస్తున్నాడు.
సందర్భవశాత్తు చాలా మంది పట్టించుకోని ఒక వాస్తవాన్ని చెప్పవలసి ఉన్నది: అధికారం వంశపారంపర్య హక్కు కాదనే విషయాన్ని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అసోంలో తరుణ్ గొగోయ్ కుమారుడు కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించడం బీజేపీ విజయానికి దోహదం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్‌కు అగ్రప్రాధాన్యమివ్వడం ఆమెకే నష్టదాయకమైనది. తమిళనాడులో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని అందలాలు ఎక్కించడం విజయ్ విజయానికి విశేషంగా తోడ్పడింది. కేరళలో పినరయి విజయన్ తన అల్లుడిని ప్రమోట్ చేయడం కాంగ్రెస్ విజయానికి సహాయపడింది. ఆయా పార్టీల జయాపజయాలకు ఇంకా చాలా కారణాలు ఉన్నప్పటికీ వంశపారంపర్య రాజకీయాలకు ప్రజల తిరస్కృతి వాటిలో మరింత ముఖ్యమైనది.
కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబంపై ఈ విమర్శలు, కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏ విధంగాను సమర్థించడం కానే కాదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలు, ప్రజా వ్యవస్థలను ఎలా నిస్సారం చేస్తోందో, మీడియాను ఎలా బెదిరిస్తూ వస్తోందో, న్యాయవ్యవస్థను ఎలా లొంగదీసుకున్నదో, ప్రజాస్వామ్య ప్రక్రియలను ఎలా బలహీనపరుస్తోందో, మైనారిటీలను ఎంత నిర్దాక్షిణ్యంగా అణచివేస్తోందో, అనుసరిస్తున్న విదేశీ విధానం ఎంత లోపభూయిష్టమైనదో, వైజ్ఞానిక పరిశోధనలకు వాటిల్లుతోన్న నష్టాన్ని ఆశ్రిత పెట్టుబడిదారులకు ఎలా లబ్ధి చేకూర్చుతున్నదీ, మన అడవులు, నేలలు, జలవనరులను ఎలా ధ్వంసం చేస్తుందో నేను ఎప్పటికప్పుడు సవివరంగా వ్యాఖ్యానిస్తూ వస్తున్నాను.
మే 2014 నుంచి మన గణతంత్ర రాజ్యం ఇలా భ్రష్టమవుతుండడానికి ప్రధాన కారకులు నరేంద్ర మోదీ, అమిత్ షా, వారి ఆధ్వర్యంలోని బీజేపీ. ఈ నాయక ద్వయం అధికారాన్ని స్వాధీనం చేసుకుని సుస్థిరం చేసుకోవడంలో ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వారి విధేయులు ఆ ఉభయులకూ సహాయపడుతున్నారనే వింత వాస్తవం ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నది.
మన భారత్ భవిష్యత్తేమిటి? నేనేమీ నిరుత్సాహపడడం లేదు. నిరాశాపూరిత వ్యాఖ్యతో నేను ఈ వ్యాసాన్ని ముగించబోవడం లేదు. నిజమే, మోదీ నాయకత్వంలో బీజేపీ ఇప్పుడు ఒక అజేయ శక్తిగా విలసిల్లుతున్నది. ఆ మాటకొస్తే హంగరీలో విక్టర్ ఓర్బాన్, ఆయన నాయకత్వంలోని ఫిడెజ్ దశాబ్దాల పాటు రాజ్యమేలలేదూ? చివరకు ఏమయింది? ఎవరికీ అంతగా తెలియని పీటర్ మాగ్యార్, ఆయన నాయకత్వంలోని టిస్జా పార్టీ ఓర్బాన్‌ను పదవీచ్యుతుణ్ణి చేశాయి. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు, సువ్యవస్థిత ప్రతిపక్షాలు సాధించలేనిదానిని మాగ్యార్ సాధించారు. ఇతర విపక్ష నేతలకు సంస్థాగత సాధనాలు రాజకీయ వేదికలు ఉన్నప్పటికీ మాగ్యార్ దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్విరామంగా పర్యటిస్తూ సామాన్య ప్రజలను సమీకరించి, సమైక్యపరిచి అంతిమ విజయాన్ని సాధించారు. పీటర్ మాగ్యార్ లాగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ తామెదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను ధిక్కరించి కదనశంఖం పూరిస్తారని ఆశించగలమా?
2029 సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశంలో రాజకీయ చర్చలు ముస్లిం విద్వేష రాజకీయాల నుంచి ఆర్థిక వాస్తవాల వైపు తప్పక మళ్లుతాయి. ఆ విద్వేష రాజకీయాలు జీవన వ్యయాలను తగ్గించవని, గౌరప్రదమైన ఉపాధిని కల్పించబోవని, తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వబోవనే సత్యాన్ని మరింత మంది హిందువులు తప్పక గుర్తిస్తారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం ఇప్పటికే ఆ సత్యాన్ని ఘోషించలేదూ? అధికార పార్టీ అసత్య ప్రచారాలను యువ భారతీయులు ఇంకెంత మాత్రం విశ్వసించడం లేదని ‘బొద్దింకల’ ఉద్యమం నిరూపించింది. మోదీ సర్కార్ పాలన పట్ల ప్రజల అసంతృప్తి మరింత తీవ్రమయినప్పుడు దానిని ఒక ప్రభావశీల రాజకీయ శక్తిగా పరిణమింపచేసేది ఎవరు? ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు జాతి ఆర్థిక, సామాజిక పునరుజ్జీవానికి నిర్మాణాత్మక కార్యక్రమాలను దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నివేదించగల నాయకుడు లేదా నాయకులు ఎవరు? జవహర్‌లాల్ నెహ్రూ ముని మనవడు లేదా ముని మనవరాలు గానీ లేదా వారిరువురు గానీ అటువంటి ఉత్తేజకర రాజకీయ చైతన్యాన్ని పురిగొల్పడం అసంభవంగా కనిపిస్తోంది. ఎన్నికల రాజకీయాలలో వారి గత రికార్డే ఈ అభిప్రాయానికి తావిచ్చింది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News