మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 29 , 2026 | 05:10 PM
తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు 2026 విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం స్పందించారు.
అమరావతి, మే 29: తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు 2026 విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం స్పందించారు. మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో తాను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జరిగిన తొలి మహానాడు ఇదని ఆయన వివరించారు. ఈ మహానాడు ఘన విజయం టీడీపీ టీం కృషి అని స్పష్టం చేశారు.
సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడు 2026ను అందరి ఆమోదంతో హైబ్రిడ్ విధానంలోకి మార్చామని మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో గురువు చంద్రబాబు నాయుడు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం మనకు నేర్పారని చెప్పారు. ఆ నేర్పును ఇంటర్నేషనల్ క్రైసిస్‌లో కూడా ఎవరూ ఊహించని విధంగా హైబ్రిడ్ మహానాడును ఒక అవకాశంగా తీసుకుని విజయవంతం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో మాదిరి ఒకచోట జరిగే మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ కుటుంబసభ్యులు తరలివచ్చేవారని పేర్కొన్నారు. తెలుగుదేశం నా బాధ్యత అంటూ ఇప్పుడూ ప్రతి పల్లె, ప్రతి ఇల్లూ మహానాడుకు వేదిక అయి.. పసుపు జెండాలతో రెపరెపలాడిందన్నారు. కార్యకర్తలే అధినేతలై.. నేతలే మార్గదర్శులై రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడు 2026ను కనివినీ ఎరుగనీ రీతిలో విజయవంతం చేశారని చెప్పారు.
స్త్రీ శక్తి థీమ్‌కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం.. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విజయం అని మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు. కార్యకర్తలే అధినేత నినాదాన్ని పార్టీ జాతీయ అధినేత అమలు చేసిన ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రెండు రోజుల మహానాడుకు ఒక్క మైటీడీపీ (MYTDP) యాప్‌లో 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదు కావడం మరో రికార్డు అని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, మహానాడు కమిటీలు, పార్టీ కార్యాలయ యంత్రాంగం, బ్యాక్ ఆఫీస్, సాంకేతిక సిబ్బంది, MYTDP, ITDP, అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా అభిమానులు, ఎన్ఆర్ఐలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మహానాడు 2026 విజయం మీ అందరికీ అంకితం చేస్తున్నానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇది మీ విజయం అని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మీ కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.