బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - May 29 , 2026 | 06:20 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్‌పై కంట్రోల్ లేదని అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోందని విమర్శించారు.
హైదరాబాద్, మే 29: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్‌పై కంట్రోల్ లేదని అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రైతుల వద్ద ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదా? అని రేవంత్ సర్కార్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పడుతున్న బాధలు తెలుసుకునేందుకు ‘రైతు గోస - బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టామన్నారు.
నాలుగు రోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. కానీ తాము చేసిన ఈ యాత్రలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఆరోపించారు. ఇవే సమీక్షలు, పర్యటనలు మంత్రులు ముందే చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి లేదన్నారు. లారీ, హామాలీల ఖర్చు రైతులే చెల్లిస్తున్నారని తద్వారా రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారని చెప్పారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాదని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోలు చేతకాకపోతే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఎందుకు కొనుగోలు చేయడం లేదని సందేహం వ్యక్తం చేశారు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలా మారిపోయారంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరి, బుద్ధి మందగించిందని.. అందుకే బీజేపీని విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా? అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందంటూ సందేహం వ్యక్తం చేశారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెట్రోల్, డీజల్‌పై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజల్‌పై 30 శాతం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా?.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. సన్ ఫ్లవర్, శనగలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల చెబుతున్నారని.. అందుకు సంబంధించిన కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తులసి మొక్క ఎండిపోయిందని బయట పడేస్తున్నారా..?
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
For More TG News And Telugu News