Share News

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

ABN , Publish Date - May 13 , 2026 | 11:32 AM

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?
YSRCP, Ananthapuram

  • సాగు భూమిగా చూపి విక్రయించిన నాయకులు

  • వారిని వదిలేసి.. కుల సంఘం నేతపై చర్యలతో మమ

అనంతపురం: మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వంకపోరంబోకును సాగుభూమిగా చూపి విక్రయించినది వైసీపీ నాయకులైతే.. వారిపై చర్యల ఊసేలేదు. ఆ భూమిలో పేదలకు పట్టాలిస్తానని నమ్మించి విక్రయించాడంటూ దళిత సంఘం నాయకుడిపై చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నాయకులను వదిలేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ycp1.jpgకుల సంఘం నాయకుడు అక్రమ వసూళ్లకు పాల్పడడం వాస్తవమని రెవెన్యూ విచారణలో తేలింది. దీంతో ఆ నాయకుడిపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కేసు నమోదు చేయాలని రెవెన్యూ ఉన్నాతాధికారులు.. పోలీసులకు సూచించారు. వాస్తవానికి వైసీపీ నాయకులు వంక పోరంబోకు భూమిని సాగు పేరిట విక్రయించారు. భూమిపై ఎలాంటి హక్కులు లేకున్నా అమ్మేశారు. వారిని వదిలేసి కుల సంఘం నాయకుడిపై మాత్రమే రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవడం పట్ల సంబంధిత వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


సాగు భూమిగా చూపి...

కురుగుంట గ్రామ సర్వే నంబరులో 153లో 6.15 ఎకరాల భూమి ఉంది. ఇందులో వైసీపీకి చెందిన కీలక నేత సాగు పేరిట విక్రయించాడు. భూమి విక్రయానికి సదరు నాయకుడు బోగస్‌ పట్టా సృష్టించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కుల సంఘం నాయకుడితో కలిసి పేదలకు విక్రయించి పెద్ద మొత్తంలో దండుకున్నారు. ఇదే భూమికి ఆనుకుని గ్రామ తాజామాజీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు భూమి ఉంది.


ఆ భూమి సాకుతో వంక పోరంబోకు భూమిలో 30సెంట్లకుపైగా పాపంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడికి విక్రయించారు. భూమి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రూ.30లక్షలకుపైనే కొనుగోలుదారులకు ఖర్చయినట్లు తెలుస్తోంది. దీంతో వారు కొన్న దానికంటే ఎక్కువగానే ఆక్రమించి కంచె వేసి, భద్రం చేసుకున్నారు. ఇలా.. వంక పోరంబోకు భూమిపై ఎలాంటి హక్కులు లేకపోయినా యథేచ్ఛగా విక్రయించి, సొమ్ము చేసుకున్నారు.


ycp1.2.jpgరూ.50 వేలతో విక్రయాలు

వంక పోరంబోకు భూమిలో వైసీపీ నాయకులు అమ్మిందిపోనూ.. మరో రెండు ఎకరాలకుపైగానే భూమి ఉంది. ఆ భూమిని బుక్కరాయసముద్రం మండలం వెంకటపురానికి చెందిన మరో వ్యక్తి చదును చేసిన విషయం తెలిసిందే. ప్లాట్లుగా వేసి, విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటిన్నర సెంటు రూ.50వేలతో అమ్మినట్లు సమాచారం. ఇప్పటికే 30 ప్లాట్ల వరకు విక్రయించినట్లు ఆ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.


రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం

సర్వే నంబరు 153లోని భూమి వంక పోరంబోకుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వైసీపీ, కుల సంఘాల నాయకులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఆ స్థలాలను చూపి పేదల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసుకుని, అంటగడుతున్నారు. ఈ తంతు నాలుగైదు నెలలుగా సాగుతోంది. అయినా.. భూమిని పరిరక్షించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ, వంకపోరం బోకు భూములను ఆక్రమించినట్లు తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ భూముల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి. అధికారులు పట్టించుకోకపోవడంతో భూ ఆక్రమణదారులకు పేట్రేగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 11:32 AM