పెళ్లికో సర్టిఫికెట్..
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:56 PM
అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా, ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం.
వివాహ ధ్రువపత్రం ఉంటే ధీమా
ప్రతి పెళ్లికి నమోదు తప్పనిసరి
బాల్యవివాహాలు, మోసాలకు చెక్
అనంతపురం: అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా, ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం. వివాహ నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. జిల్లాలో ప్రతిఏటా వేలాదిగా వివాహాలు జరుగుతున్నా వాటిని చట్టపరంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2006లో సుప్రీంకోర్టు వివాహ నమోదును తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా 2008లో కేంద్రప్రభుత్వం ప్రత్యేకచట్టం తీసుకువచ్చింది.
బాల్యవివాహాలకు అడ్డుకట్ట
బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతోంది. హిందూ వివాహ చట్టం ప్రకారం వరుడికి 21, వధువుకు 18 ఏళ్లు నిండితేనే వారికి వివాహం చేయాలి. కానీ చాలా గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి, బాల్యవివాహాల వల్ల సంభవించే నష్టాలను తెలియజేస్తున్నా, పూర్తిస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ఈ చట్టం అమలైతే పూర్తిస్థాయిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మొత్తం వివాహాలలో ఇప్పటికీ కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. వీటిలో ప్రేమవివాహాలే ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 2025 సంవత్సరంలో 1133, 2026లో ఇప్పటివరకూ 1190 హిందూ, కులాంతర, మతాంతర వివాహాలు నమోదయ్యాయి.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రేమవివాహాలే కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాలు, అన్ని కులాలు, మతాల వివాహాలను నమోదు చేసుకోవడం ఎంతో ఉపయుక్తం. అన్ని వివాహాల గుర్తింపునకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి జంటా సద్వినియోగం చేసుకోవాలి. పెళ్లిచేసుకోవాలనుకునే జంట నెలరోజులు ముందుగా వారి వివరాలను అందజేస్తే సరిపోతుంది.
హేమలత, జాయింట్ సబ్ రిజిస్ట్రార్
వివాహ నమోదు ఇలా..
వివాహం అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నమోదు చేసుకునే వధూవరుల (వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు) పెళ్లిపిలుపు కార్డు. పెళ్లినాటి ఫొటో, వధూవరుల పూర్తి చిరునామా (అడ్రస్ ప్రూఫ్), పదోతరగతి సర్టిఫికెట్, పాస్‌పోర్టు నకలు (పుట్టినతేదీ రుజువు) ముగ్గురు సాక్షులు, వారి సంతకాలు ఉంటే నమోదు సులభతరం అవుతుంది. వివాహ నమోదు చేసుకున్న మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల్లో ఈ వివాహ ధ్రువీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రేమపేరుతో జరిగే మోసాలను అడ్డుకునేందుకు, రెండో వివాహాన్ని అరికట్టేందుకు ఈ ధ్రువపత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రాజీవ్ యువ వికాసంపై నీలినీడలు
నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..
Read Latest AP News And Telangana News And International News And Telugu News