రాజీవ్ యువ వికాసంపై నీలినీడలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:29 AM
నిరుద్యోగ యువత కు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్ యువ వికాస పథకం అటకెక్కినట్టేనా? రెండేళ్ల క్రితం ఈ పథకం తెరమీదికి వచ్చింది.
రెండేళ్లవుతున్నా అందని రుణాలు
ప్రచార ఆర్భాటం తప్ప అమలు శూన్యం
ఉమ్మడి జిల్లాలో 1.85 లక్షల మంది దరఖాస్తులు
లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక పంపిణీ వాయిదా
షెడ్యూల్ సైతం ప్రకటించి చేతులెత్తేసిన సర్కార్
పథకం అమలుపై కొరవడిన స్పష్టత
రుణాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న యువత
హనుమకొండ: నిరుద్యోగ యువత కు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్ యువ వికాస పథకం అటకెక్కినట్టేనా? రెండేళ్ల క్రితం ఈ పథకం తెరమీదికి వచ్చింది. యూనిట్ల మంజూరీ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు ప్రస్తుతం అతీగతీ లేకుండా పోయాయి. దరఖాస్తుదారులు రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.
దరఖాస్తుదారులు సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ పథకం విషయంలో అధికారులకు కూడా స్పష్టత లేకపోవడంతో ఏమీ చెప్పలేక పోతున్నారు. ప్రభుత్వం మొదట్లో రాజీవ్ యువ వికాస పథకం గురించి గొప్పగా ప్రచారం చేసింది. నిరుద్యోగ యువతకు లేనిపోని ఆశలు కల్పించింది. 2025 జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత నుంచి ధరఖాస్తులను స్వీకరించింది. మంజూరైన యూనిట్ల మేరకు పత్రాలను అర్హులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. చివరి క్షణంలో రుణాల పంపిణీ వాయిదా పడింది. తాజాగా తిరిగి ప్రభుత్వం ఈ పథకంపై ఆశలు రేపడంతో యువత ఎదురుచూస్తోంది.
పరిశీలన పూర్తి..
గ్రామ, పట్టణ స్థాయిలో మంజూరైన యూనిట్ల కోసం పురపాలక, మండల స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాయి. కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఉన్న వివిధ కార్పొరేషన్ల ప్రతినిధులు ప్రత్యేకాధికారులు, బ్యాంకు అధికారులు, డీఆర్‌డీఏ ప్రతినిధులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. 2026-27 బడ్జెట్‌లోనూ మరోసారి ఈ పథకానికి రూ.6వేల కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ఈ సారైనా నిధులను విడుదల చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఐదు రకాల యూనిట్లు
రాజీవ్ యువ వికాస పథకం కింద వివిధ యూనిట్లకు ఇచ్చే సబ్సిడీ రుణ మొత్తాన్ని ఐదు రకాల యూనిట్ల కింద రాష్ట్ర ప్రభు త్వం విభజించింది. కేవలం రూ.50వేల యూనిట్‌కు మాత్రమే నూరు శాతం సబ్సిడీతో అందించనున్నట్టు తెలిపింది. ఆపైన అంటే రూ.లక్ష యూనిట్‌లో రూ.90వేలు ప్రభుత్వం, రూ.10వేల ను రుణంగా, రూ.2 లక్షల యూనిట్‌లో రూ.1.60 లక్షలను ప్రభు త్వం, మిగతా రూ.40 వేలను బ్యాంకు రుణంగా, రూ.3 లక్షల యూనిట్‌లో రూ.2.10 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.90వేల ను బ్యాంకు రుణంగా, రూ.4లక్షల యూనిట్‌లో రూ.2.80 లక్షల ను ప్రభుత్వం, మిగతా రూ.1.20 లక్షలను బ్యాంకు రుణంగా అం దివ్వాలని నిర్ణయించింది.
దరఖాస్తులు ఉన్నాయా?
ప్రతీ నియోజకవర్గంలో ఏటా 5వేల మందికి రుణాలు మం జూరు చేస్తామని, ఈ పథకం కింద రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నామని అసెంబ్లీ వేదికగా అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేయడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు పరుచుకుంటున్నాయి. గత సంవత్సరం జూన్ 2వ తేదీన రాష్ట్రావిర్భావ వేడుకల సందర్భంగా ఆ రుణాలను పంపిణీ చేస్తామని కూడా ఊదరగొట్టింది. ఈ ఏడాది జూన్ 2 దాటినా ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేకపోయింది. అసలు యువతీ యువకుల నుంచి ఏడాదిన్నర క్రితం తీసుకున్న దరఖాస్తులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
షెడ్యూల్ ప్రకటించి..
రుణాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదు విడతల్లో రుణాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 2025 జూన్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష యూ నిట్లనను ఒక లక్ష మందికి, జూలైలో రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల యూనిట్లను ఒక లక్ష మందికి, ఆగస్టులో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల యూనిట్లను మరో లక్ష మందికి, సెప్టెంబరులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్లను ఇంకో లక్ష మందికి, అక్టోబరులో రూ.4 లక్షల యూనిట్లను మరో లక్ష మందికి అందించనున్నట్టు ప్రకటించింది. ఇదంతా నిజమేనని నమ్మి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు రుణాలు ఎప్పుడు ఇస్తారో తెలియక త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడుతున్నారు.
1.85 లక్షల దరఖాస్తులు
రాజీవ్ యువ వికాస పథకం కింద వివిధ కేటగిరీల కింద ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,85,730 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో రూ.50వేల లోపు యూనిట్ రుణం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత నుంచి 28,496 రూ.లక్ష పైనా రూ.2 లక్షల వరకు యూనిట్ కోసం 49,716, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు యూనిట్ కోసం 55,602, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్ కోసం రుణానికి 51,936 దరఖాస్తులు వచ్చాయి. కాగా, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈ నెలలో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాగానే ఉమ్మడి జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు రుణా లు అందించి స్వయం ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారుల చెబుతున్నారు.
మార్గదర్శకాలు జారీ అయినా..
అర్హుల ఎంపికకు 2025 ఫిబ్రవరిలోనే మార్గదర్శకాలను జారీ చేసింది. జనాభా దామాషా కేటగిరీల వారీగా యూనిట్లకు 2025, మే నెలలోగా అర్హులను మండల స్థాయి కమిటీలు ఎంపిక చేయాలని, ఆ జాబితాలను పంపితే ఆ జిల్లా కమిటీలు 31లోగా తుది జాబితాను సిద్ధం చేసి, ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలని, 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిచింది. కానీ, ఇప్పటికీ అర్హుల జాబితాల జాడే లేదు. ఇప్పటికైనా రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణంఇచ్చి ఆదుకోవాలని నిరుద్యోగ యువత కోరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..
Read Latest AP News And Telangana News And International News And Telugu News