Share News

గాజియాబాద్-న్యూఢిల్లీ మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 రైళ్ల సర్వీసులపై ప్రభావం..

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:12 AM

ఢిల్లీ డివిజన్‌లోని గాజియాబాద్-న్యూఢిల్లీ రైల్వే మార్గంలో ఇవాళ (మంగళవారం) ఉదయం రైలు ప్రమాదం సంభవించింది. సరకుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గాజియాబాద్-న్యూఢిల్లీ మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 రైళ్ల సర్వీసులపై ప్రభావం..
Ghaziabad Train Accident

గాజియాబాద్: ఢిల్లీ డివిజన్‌లోని గాజియాబాద్-న్యూఢిల్లీ రైల్వే మార్గంలో ఇవాళ (మంగళవారం) ఉదయం రైలు ప్రమాదం సంభవించింది. సరకుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాక్ పునరుద్ధరణ, పట్టాలు తప్పిన బోగీల తొలగింపు కోసం సాంకేతిక, సహాయక బృందాలను రంగంలోకి దించారు. సాధ్యమైనంత త్వరగా రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.


53 రైళ్లపై ప్రభావం..

ఈ ప్రమాదంతో మొత్తం 53 రైళ్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి. అందులో 24 రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించగా, 16 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, ఎనిమిది రైళ్లను నియంత్రిస్తూ ఆలస్యంగా నడుపుతున్నారు. గాజియాబాద్, సాహిబాబాద్, ఢిల్లీ, న్యూఢిల్లీ మధ్య నడిచే పలు ఈఎంయూ లోకల్ రైళ్లను రద్దు చేశారు. మొరాదాబాద్ డివిజన్, నార్త్ సెంట్రల్ రైల్వే మార్గాల ద్వారా ఆనంద్ విహార్‌కు వెళ్లే కొన్ని రైళ్లను కూడా మళ్లించారు. సహారన్‌పూర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలును సాహిబాబాద్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా మార్గంలో నడుపుతున్నారు. అలీగఢ్, పల్వాల్ మార్గాల్లో నడిచే రైళ్ల షెడ్యూల్‌లోనూ మార్పులు చేశారు.


ప్రయాణికులకు రైల్వే సూచనలు..

ఉదయం రద్దీ వేళ ఈ ఘటన జరగడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు స్టేషన్‌కు బయలుదేరే ముందు ఎన్‌టీఈఎస్ (NTES) లేదా అధికారిక రైల్వే వేదికల ద్వారా తమ రైళ్ల తాజా వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలంలో సహాయక బృందాలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించి, వీలైనంత త్వరగా సాధారణ రైలు రాకపోకలను ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

Updated Date - Jul 21 , 2026 | 12:23 PM