సిక్కింలో కొండచరియలు విరిగిపడి పదిమంది మృతి
ABN , Publish Date - Jul 21 , 2026 | 07:39 AM
సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్, జులై 21 (ఆంధ్రజ్యోతి): సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నామ్‌చి జిల్లా కలెక్టర్ అనుప తమ్లింగ్ వెల్లడించారు.
నిన్న (సోమవారం) తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. పటేల్ ఇంజినీరింగ్ సంస్థ నిర్మాణ పనులు నిర్వహిస్తుండగా, సొరంగం లోపల అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అదే సమయంలో మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
ఈ ఘటన అనంతరం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సొరంగంలో మీథేన్ గ్యాస్ స్థాయిలు అధికంగా ఉండటంతో రక్షణ సిబ్బంది లోపలికి వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదనంగా ఎన్‌హెచ్‌పీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది కూడా లోపలే ఉన్నట్లు సమాచారం. సొరంగంలోకి ప్రవేశించిన తొలి సహాయక బృంద సభ్యులు మీథేన్ ప్రభావంతో శ్వాస తీసుకోవడంలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. వారిని వెంటనే బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News