చూద్దాంలే.. ‘సర్’!
ABN , Publish Date - Jul 21 , 2026 | 08:47 AM
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను హైదరాబాద్‌లో పలు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై
కాంగ్రెస్ శ్రేణుల అలసత్వం
నెల రోజులైనా దృష్టి సారించని నేతలు
ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై జాప్యం
ముషీరాబాద్‌లో చొరవ చూపని అధినేత కుటుంబం
అంబర్‌పేటలో సీనియర్ నేతలు ఆఫీసులకే పరిమితం
ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో ఆధిపత్య పోరు
హైదరాబాద్ సిటీ: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను హైదరాబాద్‌లో పలు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆశించినంతగా కదలడం లేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సర్‌పై నియోజకవర్గాల వారీగా పనితీరును విశ్లేషించగా, అసలు పనిచేయట్లేని నియోజకవర్గాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉండడం గమనార్హం.
సర్ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా, గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కదలడం లేదు. కార్యకర్తలను కదిలించడం లేదు. గ్రేటర్‌లో సీనియర్ కాంగ్రెస్ నేతలు, హేమాహేమీలున్న కానీ తమ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై జాప్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రె్‌సను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మూడు డీసీసీలు ఏర్పాటు చేయగా ఓ డీసీసీ అధ్యక్షుడిని నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దంటూ ఇన్‌చార్జిలు హెచ్చరిస్తున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లోని పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
గోషామహల్ మినహా..
గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియలో కాంగ్రెస్ దూకుడు పెంచడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియను మెరుగ్గా నిర్వహిస్తున్న 52 నియోజకవర్గాల్లో గ్రేటర్‌కు సంబంధించి కేవలం గోషామహల్ మాత్రమే ఉంది. రాష్ట్రంలో బాధ్యుల తీరు పేలవంగా ఉన్న 21 నియోజకవర్గాల్లో పది వరకు గ్రేటర్‌లోనే ఉన్నాయి. అందులో కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, బహదూర్‌పురా, యాకత్‌పురా, చార్మినార్ ముందు వరుసలో ఉన్నాయి. అధికార పార్టీ కావడంతో ముందు భాగంలో నిలువాల్సి ఉండగా, గ్రేటర్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండడం గమనార్హం.
అంబర్‌పేటలో సీనియర్లున్నా..
అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సీనియర్ నేతలున్నారు. అయినా 8 డివిజన్లకుగాను మూడింటిలోనే సర్‌లో నేతల పనితీరు మెరుగ్గా ఉన్నది. నూతన కాచిగూడ డివిజన్ వెనుకబడి ఉంది. మిగతా అంబర్‌పేట, పటేల్‌నగర్, గోల్నాక, తిలక్ నగర్ డివిజన్‌లో మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. టీపీసీసీ నేతలు, మాజీ కార్పొరేటర్లు. డివిజన్ అధ్యక్షులు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ముషీరాబాద్‌లో చొరవ కరువు
ముషీరాబాద్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవి పొందిన కుటుంబంలోని సభ్యులు సర్‌లో చురుగ్గా పాల్గొనడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలను, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం లేదు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకునే కొందరు నేతలే ఆసక్తి చూపుతున్నారు. వారిని సమన్వయం చేసి సర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సీనియర్ నేత కుటుంబం చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి.
పాతబస్తీలో నామమాత్రంగానే..
పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు సర్‌పై నామమాత్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పనిచేయని నాలుగు నియోజకవర్గాల్లో బహదూర్‌పురా నిలిచింది. పాతబస్తీలో ఏ రోజూ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేకపోవడంతో అక్కడి నేతలు, ఏజెంట్లు అనాసక్తి చూపిస్తున్నారు.
కంటోన్మెంట్‌లో కనిపించని దూకుడు
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 8 వార్డులు, మున్సిపల్ డివిజన్ మోండ మార్కెట్‌లో ‘సర్’ ఆశించినంతగా సాగడం లేదు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పలు దఫాలుగా అప్రమత్తం చేసినా ఆశించిస్థాయిలో దూకుడు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లోనే హెల్ప్ డెస్క్‌ల వద్ద పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండడంతో పాటు బీఎల్‌ఓలతో ఇంటింటికీ తిరుగుతున్నారు.
సికింద్రాబాద్‌లో ఆధిపత్య పోరు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలువురు నేతల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సర్ ప్రక్రియలో పోటీపడాల్సి ఉండగా.. ఆయా నేతలు మాత్రం వెనుకంజలో ఉన్నారు. హెల్ప్‌డె్‌స్కల వద్ద నామమాత్రంగా కూర్చుంటున్నారే తప్ప ఇంటింటికీ వెళ్లడం లేదని తెలుస్తోంది.
సనత్‌నగర్‌లో సరేసరి..
సనత్‌నగర్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న నేతలే ఓటు బ్యాంకును పెంచుకోవడానికి సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారు.
రాజేంద్రనగర్‌లో పేలవంగానే..!
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ బాధ్యుల తీరు పేలవంగా ఉన్నట్లుగా సీఎం నివేదిక స్పష్టం చేస్తోంది. మణికొండ, నెక్నాంపూర్, నార్సింగ్, కోకాపేట, హైదర్షాకోట్, బండ్లగూడ, కిస్మత్‌పూర్, మణికొండ ప్రాంతాల్లో నాయకులంతా పలు కాలనీలు, బస్తీలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి సర్ ఫారాలు నింపి దరఖాస్తు చేసుకునేందుకు సహకరిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో సర్ ప్రక్రియను చేపట్టడం లేదు.
కుత్బుల్లాపూర్‌లో సమన్వయం పూర్
రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియలో పర్వాలేదనే కాంగ్రెస్ జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉండగా, నేతల మధ్య సమన్వయ లోపం ఉందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. 24 డివిజన్‌లలో కొన్ని డివిజన్లకు అధ్యక్షులు ఎవరో కూడా తెలియని స్థితిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. సీఎం సమీక్ష తర్వాత కాంగ్రెస్ నాయకులు హెల్ప్‌డె్‌స్కలను ఏర్పా టు చేసి సర్ ప్రక్రియను చేపడుతున్నారు.
కూకట్‌పల్లిలో ‘సర్’లు కరువు
రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియలో కాంగ్రెస్ బాధ్యుల తీరు పేలవంగా ఉన్న నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి ఒకటి. ఇక్కడ 417 బూత్‌లు ఉంటే కనీసం 15-20శాతం మంది బీఎల్‌ఏలు కూడా ఫీల్డ్‌లో లేరు. 15 డివిజన్లలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఒక్కసారి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నా బూత్ ఏజెంట్లు బీఎల్‌ఓలతో కలిసి పనిచేయడం లేదు.
గోషామహల్ భేష్
రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియను మెరుగ్గా నిర్వహిస్తున్న 52 నియోజకవర్గాల్లో గ్రేటర్ నుంచి గోషామహల్ నిలిచింది. ఈ నియోజకవర్గంలో ఓ మహిళా నేత, ఓ యువ నేత మధ్య ఉన్న పోరు మెరుగైన ఫలితాలను తీసుకొస్తోంది. పోటీపడి మరీ సర్ ప్రక్రియలో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ చేయిస్తున్నారు. నియోజకవర్గంలో ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ దూకుడుగా పని చేస్తుండడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News