ఆ ముగ్గురికీ 3 వరకు రిమాండ్
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:40 AM
జగన్ హ యాంలో మద్యం రవాణా టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌కు సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితులకూ విజయవాడ కోర్టు వచ్చే నెల 3 వరకు రి మాండ్ విధించింది.
వాసుదేవరెడ్డి, కారుమూరి, కసిరెడ్డిని కోర్టులో హాజరుపరచిన సిట్
విజయవాడ, జూలై 20(ఆంధ్రజ్యోతి): జగన్ హ యాంలో మద్యం రవాణా టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌కు సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితులకూ విజయవాడ కోర్టు వచ్చే నెల 3 వరకు రి మాండ్ విధించింది. ఈ కేసులో అప్పటి రాష్ట్ర బేవరేజె స్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్(ఏ4), కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(ఏ8)లను సిట్ అధికారులు పీటీ వారెంటుపై హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ముందుగా వారికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుల తరఫున న్యాయవాదులు అనిల్, బాలకృష్ణ, గౌతమ్ వాదనలు వినిపించారు. కేసులో నమోదు చేసిన సెక్షన్ 409 తప్ప మిగిలినవన్నీ ఏడేళ్లలోపు శిక్షపడేవేనని తెలిపారు. నిందితులను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిందన్నారు. వారిని ఈడీ అరెస్టు చేయడాని కి ముందు.. మద్యం రవాణా అక్రమాలపై నమోదైన కేసులోనే సిట్ అధికారులు నోటీసిచ్చి ప్రశ్నించారని.. ఇక ఈ కేసులో విచారణ చేయాల్సిన అవసరం లేదని, నిందితులకు 41ఏ నోటీసివ్వాలని కోర్టును కోరారు. కసిరెడ్డి, వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే చంచల్‌గూడ జైలుకు వారిని తరలించాలని అభ్యర్థించారు.
మంత్రి పదవిని ఉపయోగించి..: సిట్ తరఫున ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సునీల్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, సీడీఆర్, వాట్సాప్ చాటింగ్‌లను ఆధారం చేసుకుని నిందితుడిగా చేర్చామని వివరించారు. ఆయన తండ్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని.. ఆ పదవిని ఉపయోగించి మద్యం రవాణాలో సునీల్ అవకతవకలకు పాల్పడ్డారని.. వచ్చిన డబ్బును తన ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలు ఉన్నాయన్నారు. సునీల్ రూ.16 కోట్ల ముడుపులు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకే బీఎన్‌ఎస్ 409 సెక్షన్ చేర్చామని తెలిపారు. సునీల్ సిట్ అధికారులను ప్రలోభపెట్టడానికి యత్నించారని, దీనిపై సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైందన్నారు.
ఏ జైలేతే ఏంటి: న్యాయాధికారి
వాదనలు పూర్తయ్యాక ముగ్గురు నిందితులూ న్యాయాధికారి ఎల్. తేజోవతితో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేదని.. చంచల్‌గూడ జైలుకు పంపితే.. ములాఖత్‌లో వారిని కలుసుకునే అవకాశం ఉంటుందని వాసుదేవరెడ్డి, సునీ ల్ తెలిపారు. న్యాయాధికారి స్పందిస్తూ.. ‘మీరు ఇప్పుడూ రిమాండ్‌లోనే ఉన్నారు. ఏ జైలైతే ఏ ముంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అరెస్టు చేయడానికి ముందు పోలీసులు విచారణకు పిలిచి 90 ప్రశ్నలు అడిగితే.. అందులో 70 మద్యం రవా ణా గురించే అడిగారని.. ఇక తన నుంచి తెలుసుకోవలసిన సమాచారం ఏమీ లేదని.. తనను చంచల్‌గూడ జైలుకు పంపాలని కసిరెడ్డి కోరారు. ఈడీ ప్రత్యేక కోర్టు పీటీ వారెంటుకు అనుమతి ఇచ్చినప్పుడు.. నిందితులను వర్చువల్‌గా గానీ, భౌతికకంగా గానీ కోర్టులో హాజరుపరచవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందని.. వారిని రిమాండ్‌పై విజయవాడ జైల్లోనే ఉంచాలని ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ కోర్టును కోరారు. అనంతరం న్యాయాధికారి తేజోవతి నిందితులకు వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈడీ అధికారులు కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను జూ న్ 11న. సునీల్‌ను జూన్ 18న అరెస్టు చేయడం.. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు తరలించడం.. కోర్టు అనుమతితో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని విచారించడం తెలిసిందే.