నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..
ABN , Publish Date - Jul 21 , 2026 | 07:18 AM
నేపాల్ ప్రభుత్వం తమ రూపాయి మ్యాప్ డిజైన్‌ను మార్చబోతోంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువైన కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను ఆ రూపాయి నాణెం నుంచి తొలగించనుంది.
నేపాల్ ప్రభుత్వం తమ రూపాయి మ్యాప్ డిజైన్‌ను మార్చబోతోంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువైన కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను ఆ రూపాయి నాణెం నుంచి తొలగించనుంది. దాని స్థానంలో దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ప్రాచీన బౌద్ధ మఠం చిత్రాన్ని చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు నేపాల్ మంత్రివర్గం కొత్త నాణెం రూపకల్పనకు ఆమోదం తెలిపింది (Nepal Re 1 coin).
ఇప్పటివరకు చలామణిలో ఉన్న నేపాల్ రూ.1 నాణెంపై ఆ దేశ రాజకీయ మ్యాప్‌తో పాటు భారత్‌తో వివాదంలో ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు కూడా కనిపించేవి. తాజా డిజైన్‌లో ఆ మ్యాప్‌ను పూర్తిగా తొలగించి, ముస్తాంగ్ జిల్లాలోని చారిత్రక లో గ్యాకర్ (Lo Ghyakar) బౌద్ధ మఠం చిత్రాన్ని ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది (Nepal coin redesign).
కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై భారత్, నేపాల్ రెండూ తమ హక్కును ప్రకటిస్తున్నాయి. 2020లో నేపాల్ తన కొత్త అధికారిక రాజకీయ మ్యాప్‌లో ఈ ప్రాంతాలను చేర్చడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనంతరం అదే మ్యాప్‌ను కొన్ని నాణేలు, నోట్లపై కూడా ముద్రించడం చర్చనీయాంశమైంది (Kalapani map removed).
కాగా, తాజా నిర్ణయం ప్రస్తుతం రూ.1 నాణేనికి మాత్రమే వర్తిస్తుంది (India Nepal relations). గతంలో విడుదల చేసిన రూ.100 నోటుపై ఉన్న వివాదాస్పద మ్యాప్ విషయంలో ఎలాంటి మార్పునూ నేపాల్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!