Share News

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:57 AM

ఆరేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లి దారి తప్పింది.. ఏడుస్తూ వెళ్లి ఓ రాత్రంతా చిమ్మచీకటిలో జొన్నచేలో నిద్రపోయింది. చిన్నారి అదృశ్యమైనట్లు నంద్యాల పోలీసులకు సమాచారం అందింది.

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

  • నంద్యాలలో చిన్నారి మిస్సింగ్‌

  • ‘తుని’ ఘటనతో నంద్యాల పోలీసుల అప్రమత్తం

  • డ్రోన్లతోనూ రాత్రంతా ముమ్మర గాలింపు

  • అలసిపోయి జొన్నచేలో నిద్రించిన ప్రణవి

  • గుర్తించిన పోలీసులు.. తల్లిచెంతకు క్షేమంగా..

నంద్యాల క్రైం, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లి దారి తప్పింది.. ఏడుస్తూ వెళ్లి ఓ రాత్రంతా చిమ్మచీకటిలో జొన్నచేలో నిద్రపోయింది. చిన్నారి అదృశ్యమైనట్లు నంద్యాల పోలీసులకు సమాచారం అందింది. కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం సంఘటన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ కూడా రంగంలోకి దిగారు. ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మొత్తంగా 200 మంది పోలీస్‌ బలగాలు రాత్రంతా చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి జొన్నచేనులో చిన్నారి అలసిపోయి నిద్రిపోతున్నట్లు గుర్తించడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరాలివీ.. నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేసే కళ్యాణి కుమార్తె ప్రణవితో కలసి వైఎస్సార్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి చెంత ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందుగా కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. తర్వాత రాత్రి 9 గంటలకు తల్లి కళ్యాణి డయల్‌-100కు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అధికారులతో సమీక్షలు జరిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


డ్రోన్‌ కెమెరాలు, పోలీస్‌ జాగిలాలను రంగంలోకి దించారు. ప్రతి వీధిలోని సీసీటీవీ ఫుటేజీలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత చిన్నారి వెళ్లిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు చీకటి పడటంతో ఆచూకీని కనుగొనేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రాత్రంతా పోలీసులు టార్చిలైట్లు వేసుకుని గాలించారు. సమీపంలోని పొలాల్లో కూంబింగ్‌ చేపట్టారు. అయితే కాలనీకి కొద్ది దూరంలో ఉన్న జొన్న చేనులో ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు గుర్తించారు. రాత్రంతా భయంతో గుక్కపట్టి ఏడుస్తూ, అలసిపోయి నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పోలీసులు తీసుకొచ్చి తల్లి కళ్యాణికి అప్పగించారు. ప్రణవి క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jul 21 , 2026 | 05:59 AM