Share News

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:12 AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ అధీనంలోనే  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

  • ప్రైవేటీకరణ చేస్తారనడం దుష్ప్రచారమే

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో వివిధ శాఖల పనితీరును సీఎం సమీక్షించారు. ఆస్తుల క్రయవిక్రయాల దస్తావేజుల తయారీని సులభతరం చేసేందుకే రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. ‘‘ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్‌ సేవలందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు(ఆర్‌ఎ్‌సకే)ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ కాదు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు పనిచేస్తాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్‌పోర్టు ప్రాసెసింగ్‌ చాలా సులువైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల పనితీరు ఉంటుంది. వీటి విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. అలాగే డాక్యుమెంట్‌ రైటర్లు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. వారి ఉపాధికి ఇబ్బందిలేని విధంగా మార్గాలు చూపుతాం’’ అని సీఎం చెప్పారు. దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై పౌర సంబంధాలు, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన సాంకేతికాంశాలను పరిశీలించి అమలు చేయాలన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల 49 శాతం వర్షపాతం లోటు ఉందని చెప్పారు. ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. రైతుల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆరుతడి పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇదే సమయంలో వీబీజీ రామ్‌జీ పనులు పెద్దఎత్తున చేపట్టాలని స్పష్టం చేశారు.


లిటిగెంట్‌ పిటిషనర్లకు కౌన్సెలింగ్‌

‘‘లిటిగెంట్‌ పిటిషనర్లను కట్టడి చేయాలి? ప్రజా ప్రయోజనాలు లేకుండా చేసే ఫిర్యాదులను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా 81 మంది లిటిగెంట్‌ పిటిషనర్లు ఉన్నారని గుర్తించాం. వీరు సగటున 246 పిటిషన్లు ఇస్తున్నారని తేలింది. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలి. వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే పరిశీలించాలి. అధికారులను బద్నాం చేసే ఉద్దేశంతో పిటిషన్లు పెట్టేవారిని గుర్తించాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి. ప్రాధాన్యాల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దాం’’ అని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజాభిప్రాయం మేరకు విధానాల్లో మార్పులూ చేర్పులూ చేయాల్సి ఉందన్నారు.

పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే

పీపీపీ విధానమంటే ప్రభుత్వ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం లేదా రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారాలను ప్రైవేటీకరించడం కాదని ఆ శాఖ కమిషనర్‌, ఐజీ బీఆర్‌ అంబేద్కర్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రిజిస్ర్టేషన్‌ సేవా కేంద్రాల వల్ల ప్రజల డేటా ఎవరి చేతుల్లోకీ వెళ్లదని, ప్రభుత్వం పరిధిలోని తమ శాఖ నియంత్రణలోనే ఉంటుందని వెల్లడించారు. రిజిస్ర్టేషన్‌ సేవా కేంద్రాల్లో ఉపయోగించే మొత్తం సాఫ్ట్‌వేర్‌, అప్లికేషన్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌, డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, సర్వర్లు, డేటా సెంటర్లు, బయోమెట్రిక్‌ సమాచారం, డాక్యుమెంట్‌ డేటాబేస్‌లు, ఎలక్ర్టానిక్‌ రిజిస్టర్లు, ఇతర అధికారిక సమాచార వ్యవస్థలు పూర్తిగా రిజిస్ర్టేషన్‌, స్టాంపుల శాఖ నియంత్రణ, పర్యవేక్షణలోనే కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వ డేటా, రికార్డులు, డేటాబేస్‌లపై ప్రైవేట్‌ భాగస్వామికి అప్పగించే అవకాశమే లేదన్నారు. ఈ సంస్కరణ ద్వారా ప్రజలకు ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌, ముందస్తు స్లాట్‌ బుకింగ్‌, పబ్లిక్‌ డేటా ఎంట్రీ, డిజిటల్‌ చెల్లింపులు, నిర్దేశిత సమయానికే సేవలందించడం, ప్రాథమిక సౌకర్యాలతో కూడిన వెయిటింగ్‌ హాళ్లు, డిజిటల్‌ సమాచార వ్యవస్థలు.. ఇవన్నీ ఒకే కేంద్రంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అపోహలను నమ్మి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవసరమైన ప్రతి ఒక్కరూ రిజిస్ర్టేషన్‌ సేవా కేంద్రాలను వినియోగించుకుని మెరుగైన సేవలు పొందాలని సూచించారు.


భూములిచ్చిన ప్రతి రైతునూ విమానం ఎక్కిస్తాం

1న ఉత్తరాంధ్ర అంతటా ఉత్సవ వాతావరణం కనిపించాలి: సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్ర మణిహారంగా అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్‌పోర్టు మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 1న విమానాశ్రయంతోపాటు జీఎమ్మార్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, ఏవియేషన్‌ హబ్‌, ఏవియేషన్‌ వర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో... పీఎం పర్యటన ఏర్పాట్లపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రధానికి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతీసంప్రదాయాలు, థింసా, కొమ్ము, కోయ, సవర తదితర సంప్రదాయ నృత్యాలతో అఖండ స్వాగతం పలకేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు.

ఆ రైతులకు ఒకసారి ఉచిత ప్రయాణం

విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 1న ఉత్తరాంధ్ర అంతటా ఉత్సవ వాతావరణం కనిపించాలని సీఎం సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరికీ ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి ఈ నెల 31వరకు విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ విశిష్ఠత ఉత్తరాంధ్రలోని ప్రతిగడపకూ తెలిసేలా రానున్న పది రోజులూ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో హోంమంత్రి అనిత, సీఎస్‌ సాయిప్రసాద్‌, ఏవియేషన్‌, జీఎంఆర్‌ అధికారులు పాల్గొన్నారు. కాగా, భోగాపురం విమానాశ్రయాన్ని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ సోమవారం పరిశీలించారు. బందోబస్తు, వేదిక, ట్రాఫిక్‌, పార్కింగ్‌, ప్రొటోకాల్‌ అంశాలపై అధికారులతో చర్చించారు.

Updated Date - Jul 21 , 2026 | 06:13 AM