Share News

కుర్రాళ్లు కొట్టేశారు

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:31 AM

సరిగ్గా 16 ఏళ్ల కిత్రం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏలిన స్పెయిన్‌.. మళ్లీ ఆస్థాయిని అందుకోవడానికి మరో తరం రావాల్సి వచ్చింది. యూరోపియన్‌ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌.. మెగా టోర్నీకి ముందే....

కుర్రాళ్లు కొట్టేశారు

విశ్వవిజేత స్పెయిన్‌

వరల్డ్‌కప్‌ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం

తేలిపోయిన మెస్సీ సేన

అవరోధాలు ఎదురైనా.. అలుపెరుగని పోరాటం చేసింది. డిఫెన్స్‌తో గోడ కట్టిన స్పానిష్‌ టీమ్‌.. అద్భుత పాస్‌లతో ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై నిర్విరామంగా దాడులు చేస్తూ.. ప్రత్యర్థిని వణికించింది. అటాకింగ్‌ గేమ్‌తో విరుచుకుపడే అర్జెంటీనా జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. మెస్సీలాంటి ఆటగాడికి సైతం అవకాశమివ్వకుండా కట్టిపడేసింది. ఎట్టకేలకు అదనపు సమయంలో టోరెస్‌ సూపర్‌ గోల్‌తో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. మొత్తంగా టికి-టాకా వ్యూహంతో అదరగొట్టేసింది.

36 ఏళ్ల తర్వాత..

టోర్నీ ఆసాంతం ఒక్క మ్యాచ్‌లో కూడా వెనుకంజలో లేకుండా, ఓటమనేదే లేకుండా టైటిల్‌ నెగ్గిన అరుదైన ఘనతను స్పెయిన్‌ సొంతం చేసుకొంది. గతంలో ఇటలీ (1938, 1984), జర్మనీ (1990) ఇలాంటి ప్రదర్శన చేశాయి. మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్పెయిన్‌ కూడా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ.. ఒక్కసారి కూడా గోల్స్‌తో వెనుకబడలేదు.

న్యూజెర్సీ: సరిగ్గా 16 ఏళ్ల కిత్రం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏలిన స్పెయిన్‌.. మళ్లీ ఆస్థాయిని అందుకోవడానికి మరో తరం రావాల్సి వచ్చింది. యూరోపియన్‌ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌.. మెగా టోర్నీకి ముందే టైటిల్‌ ఫేవరెట్‌లతో ఒకటిగా నిలిచింది. కానీ, ప్రపంచ కప్‌ లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌లో పసికూన కేప్‌ వెర్డెతో గోల్‌ లెస్‌ డ్రాగా ముగించడంతో.. ఈ టీమ్‌కు అంత సీన్‌లేదని పెదవి విరిచారు. కానీ, నాకౌట్‌ నుంచి తమ అసలు సిసలు ఆటతో మేటి జట్లను కంగుతినిపించింది. అదే జోరులో నిలకడ.. వేగం.. అలుపులేని యువ రక్తంతో సమష్టిగా చెలరేగిన స్పెయిన్‌ రెండోసారి జగజ్జేతగా నిలిచింది. అదనపు సమయంలో ఫెర్రాన్‌ టోరెస్‌ (106వ నిమిషం) గోల్‌తో అర్జెంటీనా నివ్వెరపోయింది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో స్పెయిన్‌ 1-0తో అర్జెంటీనాను ఓడించింది. తుది పోరుకు చేరిన రెండోసారి కూడా ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకొంది.

సాదాసీదాగా అర్జెంటీనా: పక్కావ్యూహంతో ఆద్యంతం ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసిన స్పెయిన్‌.. మ్యాచ్‌ను ఏకపక్షంగా ఏలేసింది. అటాకింగ్‌ గేమ్‌తో విరుచుకుపడే అర్జెంటీనా.. స్పెయిన్‌ ముందు సాదాసీదా జట్టుగా తేలిపోయింది. ఇక, దిగ్గజం లియోనెస్‌ మెస్సీ ఫీల్డ్‌లో ఎక్కడున్నాడో కానరాని పరిస్థితి. వాస్తవంగా చూస్తే అర్జెంటీనా కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌, స్పెయిన్‌ మధ్య ఎక్కువగా పోరు నడిచింది. దాదాపు డజను గోల్స్‌ను మార్జినెజ్‌ అడ్డుకోకుంటే.. అర్జెంటీనా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మిడ్‌ఫీల్డ్‌పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన లా రోజా టీమ్‌.. అర్జెంటీనా ప్లేయర్లను తీవ్ర అసహనానికి గురి చేసింది. దీంతో మెస్సీ లాంటి మేటి స్ట్రయికర్లకు బంతిని కూడా సహచరులు అందించలేక పోయారు. స్పెయిన్‌ ఉధృత దాడులను కాచుకోవడంలోనే తలమునకలైన అర్జెంటీనా.. మ్యాచ్‌ మొత్తంలో ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్కసారి కూడా దాడి చేయలేక పోవడం గమనార్హం. మ్యాచ్‌ మొత్తంలో స్పెయిన్‌ 12 సార్లు గోల్‌ పోస్టుపై దాడులు చేస్తే.. అర్జెంటీనా ఒక్కసారి కూడా టార్గెట్‌పై అటాక్‌ చేయలేదు. ఆటగాళ్ల దుందుడుకు వైఖరి కూడా కొంత నష్టం చేసింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో స్పెయిన్‌, అర్జెంటీనా 0-0తో గోల్‌ లెస్‌గా ముగించడంతో.. ఫలితం అదనపు సమయానికి దారి తీసింది. అయితే, సెకండాఫ్‌ ఇంజ్యూరీ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్‌ రెడ్‌ కార్డ్‌కు గురి కావడంతో అర్జెంటీనాను ఒకరకంగా దెబ్బతీసింది.


9-Sports.jpg

విన్నింగ్‌ గోల్‌ ఇలా...

ఎక్స్‌ట్రా టైమ్‌ ఫస్టా్‌ఫలో కూడా ఇరుజట్లూ గోల్‌ చేయలేక పోయాయి. కానీ, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన టోరెస్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఎక్స్‌ట్రా టైమ్‌ సెకండాఫ్‌ మొదలైన వెంటనే స్పెయిన్‌ ఆటగాళ్లు వేగంగా అర్జెంటీనా గోల్‌ పోస్టువైపు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో 106వ నిమిషంలో పెడ్రో పోరో క్రాస్‌ను నికో విలియమ్స్‌ హెడర్‌తో వెనక్కినెట్టాడు. అక్కడే కాచుకొన్న టోరెస్‌.. లెఫ్ట్‌ ఫుట్‌షాట్‌తో బార్‌ కిందుగా బంతిని గోల్‌లోకి కొట్టి జట్టును సంబరాల్లో ముంచాడు. అర్జెంటీనా సమం చేసేందుకు కొంత ప్రయత్నించినా.. రక్షణాత్మక ఆటతో స్పెయిన్‌ విశ్వవిజేతగా నిలిచింది.

10-Sports.jpg

‘టాప్‌’ లేపిన ఎంబాపె

ఈ ప్రపంచక్‌పలో ఫేవరెట్‌ అనుకున్న ఫ్రాన్స్‌ జట్టు సెమీ్‌సలోనే ఇంటిబాట పట్టినా.. ఆ జట్టు సారథి కిలియన్‌ ఎంబాపె మాత్రం రికార్డులతో టాప్‌ లేపాడు. ఈ టోర్నీలో పది గోల్స్‌ చేసి గోల్డెన్‌ బూట్‌ గెలుచుకున్నాడు. ఈ అవార్డు నెగ్గడం అతనికిది వరుసగా రెండోసారి కావడం విశేషం. అంతేకాదు..ప్రపంచకప్‌ కెరీర్‌లో 22 గోల్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ మెగా టోర్నీలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్లలో ఎంబాపె టాప్‌లో నిలిచాడు. 21 గోల్స్‌తో మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు.

కూల్‌గా మార్టినెజ్‌..

అర్జెంటీనా అంతో ఇంతో పరువు కాపాడుకొందంటే గోల్‌ కీపర్‌ మార్టినెజ్‌ అనుభవం వల్లే. సహచరులు తీవ్ర అసహనంతో ఊగిపోతున్నా కూడా.. కూల్‌గా ఉన్న మార్టినెజ్‌ 105 నిమిషాలపాటు ఒంటి చేత్తో మ్యాచ్‌ను కాపాడాడు. గోల్‌ పోస్టుకు గోడలా నిలిచిన అతడు 12 గోల్స్‌ను అడ్డుకొన్నాడు. 2022లో కూడా ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో మార్టినెజ్‌ హీరోగా నిలిచాడు.

7-Sports.jpg

ప్రచార ఆర్భాటం.. ట్రంప్‌ అభాసుపాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార ఆర్భాటానికిపోయి అభాసులపాలైన సంఘటన ఫైనల్‌ సందర్భంగా చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం స్పెయి న్‌ జట్టు కెప్టెన్‌ రోడ్రికి ట్రంప్‌ ట్రోఫీ బహూకరించారు. అనంతరం స్పెయిన్‌ ఆటగాళ్లు ట్రోఫీని ముద్దాడుతూ సంబరాలు చేసుకుంటుండగా, ట్రంప్‌ పోడియంపైనే ఉండి కెమెరా ఫ్రేమ్‌లో ఉండేందుకు ప్రయత్నించారు. దీంతో స్పెయిన్‌ ఆటగాళ్లు కాస్త అసౌకర్యంగా ఫీలయ్యారు. కెప్టెన్‌ రోడ్రి కూడా చేయిపట్టిమరీ ట్రంప్‌ను పక్కకు వెళ్లమన్నాడు. దీన్ని గమనించిన పిఫా చీఫ్‌ గియాని వెంటనే ట్రంప్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోలకు పోజులివ్వడం కోసమే ట్రంప్‌ పోడియంపై నుంచి వెళ్లకుండా అక్కడే నిల్చున్నారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


11-Sports.jpg

తన్నుకున్న ఆటగాళ్లు

ఫైనల్‌ మ్యాచ్‌ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్ల గొడవతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటమి తర్వాత అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌ లియాండ్రో పరెడెస్‌ కాస్త దూకుడుగా వ్యవహరించడం ఘర్షణకు దారితీసింది. సంబరాలు చేసుకుంటున్న స్పెయిన్‌ ఆటగాళ్లు ఎరిక్‌ గార్సియా, గావిలను దూషిస్తూ వారిపైకి పరెడెస్‌ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో గొడవ పెద్దదై ఇరుజట్ల ఆటగాళ్లు చొక్కాలు చింపుకొని తన్నుకునే దాకా వెళ్లింది. అనంతరం అర్జెంటీనా చీఫ్‌ కోచ్‌తో పాటు సహాయ సిబ్బంది వచ్చి ఆటగాళ్లను విడదీశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఫిఫా.. గొడవకు కారణమైన పరెడె్‌సకు రెడ్‌కార్డ్‌ ఇచ్చింది. అంతకుముందు మ్యాచ్‌ మధ్యలో అర్జెంటీనాకే చెందిన ఎంజో ఫెర్నాండెజ్‌ కూడా రెడ్‌కార్డ్‌కు గురైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:31 AM