రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:08 PM
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉంటారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉంటారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరాడు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో.. వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమ్ మేనేజ్‌మెంట్ యువ ప్లేయర్ల వైపు మొగ్గుచూపుతుండటం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రో-కో ఇబ్బంది పడుతుండటంతో రిటైర్‌మెంట్ వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో యువీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న పరిస్థితిని నేను కూడా ఎదుర్కొన్నాను. వాళ్లు ఆడాలా? వద్దా? అని బయటివాళ్లు తీర్పు ఇవ్వడం సరైంది కాదు. ఆ నిర్ణయం జట్టు యాజమాన్యం, కోచ్, సెలక్టర్ల మీదే ఆధారపడి ఉంటుంది. రో-కోని 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగించాలన బీసీసీఐ భావిస్తే.. వారికి పూర్తి భరోసా కల్పించాలి. వారి భుజంపై చేయి వేసి.. ‘మేము మీ వెంటే ఉంటాం.. ఒత్తిడి లేకుండా మీ సహజ ఆట ఆడండి. ఒక సిరీస్‌లో విఫలమైనంత మాత్రానా జట్టులో స్థానం కోల్పోతామని భావించకండి’ అని వారికి చెప్పాలి’ అని యువీ వెల్లడించాడు.
అదే విషయాన్ని చెప్పండి..
‘ఒకవేళ వారిని ఆడించలేమని అనుకుంటే.. అదే విషయాన్ని నిజాయితీగా చెప్పేసేయండి. కోచ్, కెప్టెన్, సెలెక్టర్లు... ఎవరు అయినా సరే ఆటగాడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. నాకు ఆ స్పష్టత లేకపోవడం బాధ కలిగించింది. ఎన్నో ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాడికి అలాంటి పరిస్థితి రావడం మంచిది కాదు. ఎవరైనా మీ ప్రణాళికల్లో లేకపోతే నిజాయితీగా ముఖాముఖిగా చెప్పండి. ఆ నిర్ణయం కఠినమైనదే కావచ్చు. బయట విమర్శలు రావచ్చు. కానీ నిజం చెప్పినందుకు ఆటగాడు తప్పకుండా గౌరవిస్తాడు’ అని యువరాజ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్: చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు.. మెస్సిపై విమర్శల జల్లు
అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ