ఫిఫా ఫైనల్: చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు.. మెస్సిపై విమర్శల జల్లు
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:23 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. స్పెయిన్ డిఫెండర్ మార్క్ కుకురెల్లాకు రెడ్ కార్డ్ చూపించాలని రిఫరీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మెస్సిపై ఆరోపణలు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. స్పెయిన్ డిఫెండర్ మార్క్ కుకురెల్లాకు రెడ్ కార్డ్ చూపించాలని రిఫరీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మెస్సిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్లు మెస్సి తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే..
స్పెయిన్-అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్‌కు రెండో అర్థంలో రిఫరీ విన్సిచ్ రెడ్ కార్డు చూపించారు. ఈ నిర్ణయాన్ని అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో.. స్పెయిన్ డిఫెండర్ మార్క్ కుకురెల్లా మెస్సి వద్దకు వెళ్లి మాట్లాడాడు. ఆ సమయంలో కుకురెల్లా కాసేపు తన చేతిని నోరుకు అడ్డంగా పెట్టుకున్నట్లు కనిపించింది. దీంతో ఫిఫా కొత్త నిబంధనలను ప్రస్తావిస్తూ కుకురెల్లాకు కూడా రెడ్ కార్డు చూపించాలని మెస్సి.. రిఫరీ విన్సిచ్‌ను కోరాడు. అయితే కుకురెల్లా చర్య నిబంధనల ప్రకారం రెడ్ కార్డ్ చూపించే స్థాయిలో లేదని భావించిన రిఫరీ.. మెస్సి విజ్ఞప్తిని తిరస్కరించాడు. దీనిపై మాజీ ప్లేయర్లు మెస్సి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు..
‘ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఆటగాళ్లకు రెడ్ కార్డులు ఇవ్వాలని కోరడం వల్ల ఆట స్ఫూర్తే దెబ్బతింటుంది. ఎదుటి ప్లేయర్‌ను బయటకు పంపించాలని ప్రయత్నించడం చిన్నపిల్లాడిలా ప్రవర్తించినట్లే. మెస్సి తీరు ఏమాత్రం సమంజసం కాదు’ అని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ లీ డిక్సన్ వ్యాఖ్యానించాడు. మెస్సి తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వేన్ రూనీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘అర్జెంటీనా ఆటగాళ్లు ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తారని అందరికీ తెలుసు. కానీ ప్రపంచ కప్ ఫైనల్‌లో మంచి క్రీడాస్ఫూర్తి కనిపించాలని ఆశిస్తాం. మెస్సి ఇలా చేయడం నిరాశ కలిగించింది’ అని రూనీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్ స్టార్ ఫెరాన్.. ఫిఫా కంటే ముందే భారత్‌లో మెరిశాడు!
ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?