స్పెయిన్ స్టార్ ఫెరాన్.. ఫిఫా కంటే ముందే భారత్‌లో మెరిశాడు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:04 PM
ఫిఫా ప్రపంచకప్2026 టోర్నీ ముగిసింది. స్పెయిన్ స్టార్ ఫెరాన్ టోరెస్ పేరు మాత్రం మారుమోగుతోంది. ఇతడు అర్జెంటీనా ఆశలకు గండి కొడుతూ.. స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో 106వ నిమిషంలో ఎడమకాలితో అద్భుతమైన గోల్ కొట్టి స్పెయిన్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించిన ఫెరాన్ టోరెస్(Ferran Torres) రాత్రికి రాత్రే ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయాడు. 26 ఏళ్ల ఈ బార్సిలోనా ఫార్వర్డ్ ఖాతాలో ఇప్పటికే అత్యున్నత అంతర్జాతీయ ట్రోఫీలు ఉన్నాయి. అయితే ఈ స్పెయిన్ హీరోకి భారతదేశంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. మరి.. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పెయిన్ దేశానికి ప్రపంచకప్ అందించడానికి తొమ్మిదేళ్ల క్రితమే అంటే17 ఏళ్ల పసి పిల్లాడిగా ఉన్న టోరెస్ భారత్‌లో అడుగుపెట్టాడు. 2017లో ఇండియా వేదికగా జరిగిన 'ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌లో స్పెయిన్ జట్టు రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి వాలెన్సియా అకాడమీకి చెందిన ఈ కుర్రాడు రైట్ వింగర్‌గా రాణించి 2 గోల్స్, 2 అసిస్ట్‌లతో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడా ప్రాంగణాల్లో టోరెస్ చూపించిన మెరుపు వేగమే ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ విజేతగా స్పెయిన్‌ను నిలిపింది. అంతేకాక సీనియర్ ప్రపంచ కప్‌లో హీరోగా మారాడు టోరెస్.
భారత్‌తో కేవలం టోరెస్ మాత్రమే కాదు, స్పెయిన్ జట్టులోని సెంటర్ బ్యాక్ ఎరిక్ గార్సియా కూడా అనుబంధం ఉంది. అతడు కూడా 2017లో భారత పర్యటనకు వచ్చిన అండర్-17 జట్టులో సభ్యుడే కావడం విశేషం. స్పెయిన్ జట్టులో సహచరుడైన గార్సియా, అర్జెంటీనాతో జరిగిన ఈ ఫైనల్లో 21 నిమిషాల పాటు మైదానంలో ఆడాడు. నాటి భారత గడ్డపై పడిన ఆణిముత్యాలు నేడు ప్రపంచ ఫుట్‌బాల్ సీనియర్ వేదికపై ఛాంపియన్లుగా నిలవడం భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు ఎంతో గర్వకారణం. 2000, ఫిబ్రవరి 29న జన్మించిన టోరెస్ స్వస్థలం స్పెయిన్‌లోని ఫోయెస్. నాలుగేళ్లకోసారి పుట్టినరోజు చేసుకునే టోరెస్.. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌లో హీరో కావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?
ఫిఫా పోడియంపై ట్రంప్ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో