Share News

విన్సిచ్ రెఫరీగా వస్తే ఓటమి ఖాయమా? అర్జెంటీనాను వెంటాడిన 'బ్యాడ్ లక్'!

ABN , Publish Date - Jul 20 , 2026 | 10:58 AM

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు మరోసారి 'అశుభ సెంటిమెంట్' ఎదురైంది. స్లోవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్ సెంటిమెంట్‌తో అర్జెంటీనా ఓడిందని ఆ దేశ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

విన్సిచ్ రెఫరీగా వస్తే ఓటమి ఖాయమా? అర్జెంటీనాను వెంటాడిన 'బ్యాడ్ లక్'!
Slavko Vincic

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభతో పాటు అదృష్టం, కొన్ని ఆసక్తికరమైన సెంటిమెంట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు సరిగ్గా అదే రకమైన 'అశుభ సెంటిమెంట్' ఎదురైంది. స్పెయిన్‌తో జరిగిన దిగ్గజ పోరుకు స్లోవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్ (Slavko Vincic) బాధ్యతలు నిర్వహిస్తారని ఫిఫా ప్రకటించినప్పుడే అర్జెంటీనా అభిమానుల్లో కలవరం మొదలైంది.


ఇక మ్యాచ్ ముగిశాక ఆ భయమే నిజమైంది. దీనికి ప్రధాన కారణం... గతంలో విన్సిచ్ రెఫరీగా వ్యవహరించిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా పరాజయాన్ని మూటగట్టుకోవడమే. 2022 ఖతార్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో ఘోర పరాజయం పాలై షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆ ఓటమితో అర్జెంటీనా వరుస 36 మ్యాచ్‌ల విజయవిహారానికి తెరపడింది. తాజాగా ఇప్పుడు 2026 ఫైనల్ పోరులో కూడా విన్సిచ్ మైదానంలోకి దిగడంతో పాత సెంటిమెంట్ పునరావృతమైంది.


స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అర్జెంటీనా 0-1 తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. మ్యాచ్ పొడవునా కఠినమైన నిర్ణయాలు, ఒత్తిడి మధ్య సాగిన ఈ పోరులో అర్జెంటీనా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో 'విన్సిచ్ రెఫరీగా వస్తే అర్జెంటీనాకు ఓటమే' అనే అపవాదు, సెంటిమెంట్ అంశం ఫుట్‌బాల్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచకప్ ఫైనల్: కొట్టుకున్న స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు!

వెంటనే మరో ప్రపంచ కప్ నిర్వహిస్తాం: ట్రంప్

Updated Date - Jul 20 , 2026 | 10:58 AM