ప్రపంచకప్ ఫైనల్: కొట్టుకున్న స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 10:30 AM
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇక మ్యాచ్ ముగింపు సమయాన చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇక మ్యాచ్ ముగింపు సమయాన చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అదనపు సమయంలో స్పెయిన్ 1-0 తేడాతో గెలిచి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకోగా, ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో ఘర్షణకు దిగారు. ఫైనల్ విజిల్ పడగానే స్పెయిన్ ఆటగాళ్లు విజయోత్సవాల్లో మునిగిపోతున్న వేళ, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పారేడేస్ హద్దుమీరి ప్రవర్తించాడు.
స్పెయిన్ డిఫెండర్ ఎరిక్ గార్సియా మెడపై చెయ్యేసి తోసివేయడమే కాకుండా, సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తున్న యువ ఆటగాడు గావిని బలవంతంగా కిందకు నెట్టివేశాడు. అదే సమయంలో అర్జెంటీనా డిఫెండర్ నహుయెల్ మోలీనా కూడా స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిపై భౌతిక దాడికి దిగడం ఉద్రిక్తతను పెంచింది. మ్యాచ్ సాగుతున్న సమయంలోనే ఎన్జో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ పొంది నిష్క్రమించగా, ఈ ఘర్షణ వాతావరణం మైదానాన్ని మరింత వేడెక్కించింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అర్జెంటీనా కోచ్ లయనెల్ స్కలోని త్వరితగతిన జోక్యం చేసుకుని పారేడేస్‌ను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా తీవ్రంగా భౌతిక దాడికి దిగినందుకు గాను రెఫరీ పారేడేస్‌కు నేరుగా రెడ్ కార్డ్ జారీ చేశారు. ప్రపంచకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ సంబరాల వేళ, ఓడిపోయిన జట్టు క్రమశిక్షణారాహిత్యంతో ఘర్షణకు దిగడంపై ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
వెంటనే మరో ప్రపంచ కప్ నిర్వహిస్తాం: ట్రంప్
ఫిఫా ప్రపంచ కప్ 2026: అర్జెంటీనా ఓటమి కారణలు ఇవే!