అమెరికా ఉపాధ్యక్షుడి ఇంట ఆనందం.. మగబిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్
ABN , Publish Date - Jul 20 , 2026 | 10:20 AM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతుల ఇంట ఆనందం నెలకొంది. తమకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు ఈ జంట ఆదివారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతుల ఇంట ఆనందం నెలకొంది. తమకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు ఈ జంట ఆదివారం ప్రకటించింది. తమ శిశువుకు అలెక్ నీల్ వాన్స్(Alec Neel Vance) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. 'ఉషా, శిశువులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తమ్ముడిని చూసి మా పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు' అని జేడీ వాన్స్ అన్నారు. ప్రసవ సమయంలో సేవలందించిన వాల్టర్ రీడ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహా వైట్‌హౌస్ మెడికల్ యూనిట్‌కు ఈ సందర్భంగా వాన్స్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలెక్ నీల్.. వాన్స్ దంపతులకు నాలుగో సంతానం, మూడో కుమారుడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఇవాన్(9), వివేక్(6), కుమార్తె మిరాబెల్(4) ఉన్నారు. కుటుంబ గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ తమ పిల్లలను ప్రజా జీవితానికి దూరంగా ఉంచుతున్నారు వాన్స్ దంపతులు.
శతాబ్దంన్నర తర్వాత..
జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో సంతానం కలగడం అమెరికా రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది. సుమారు 150ఏళ్ల క్రితం డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఉన్న స్కైలర్ కొల్ఫాక్స్ పదవిలో ఉండగా తండ్రయ్యారు. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అమెరికా ఉపాధ్యక్షుడిగా వాన్స్ నిలిచారు.
41ఏళ్ల వాన్స్ అమెరికా చరిత్రలో మూడో అత్యంత పిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి:
ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు
వెంటనే మరో ప్రపంచ కప్ నిర్వహిస్తాం: ట్రంప్