Share News

ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు..

ABN , Publish Date - Jul 20 , 2026 | 09:26 AM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు..

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. జులై 18న ఉత్తర ఇరాక్‌లో కూల్చివేసిన ఇరాన్ డ్రోన్‌కు చెందిన పేలుడు పదార్థాలను అమెరికా సైనికులు నిర్వీర్యం చేస్తున్నారని.. ఆ సమయంలో పేలుడు సంభవించి ఓ సైనికుడు మృతిచెందగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.


అమెరికా తూర్పు కాలమానం (ET) ప్రకారం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ కొత్త దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది. వరుసగా తొమ్మిదో రోజు దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు వినియోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సెంట్‌కామ్ పేర్కొంది. కాగా, అమెరికా దాడుల సమయంలోనే ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధిలో ఓ నౌకలో మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ సైన్యం వెల్లడించింది. అగ్నిప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది.


చాలా తీవ్రంగా దాడి చేశాం: ట్రంప్

ఇరాన్‌పై చేసిన తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల గౌరవార్థమే ఈ దాడులు నిర్వహించామని ఆయన తెలిపారు. 'ఈరోజు రాత్రి ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుల గౌరవార్థమే ఈ చర్యలు చేపట్టాం' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడానికే అమెరికా సైనికులు పోరాడుతున్నారని ఆయన చెప్పారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.


ఇరాన్ ప్రతీకార దాడులు..

మరోవైపు అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ వైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను మళ్లీ అప్రమత్తం చేశాయి. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని లోరెస్టాన్ ప్రావిన్స్ నుంచి శత్రు లక్ష్యాలపై మరో విడత క్షిపణులను ప్రయోగించినట్లు అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది.


బహ్రెయిన్‌కు అమెరికా హెచ్చరిక..

బహ్రెయిన్ రాజధాని మనామా మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అయితే ముప్పు ఉన్న ప్రాంతాల వివరాలను వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, జోర్డాన్ వైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల శకలాలు ఇజ్రాయెల్ భూభాగంలో పడే అవకాశం ఉందని, వాటి కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ తమ ప్రజలను హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

చైనాలో రోబోల ఎంఎంఏ ఫైట్‌

ట్రంప్‌ పోస్టులకు నెలకు 96 లక్షలు

Updated Date - Jul 20 , 2026 | 09:36 AM