ఫిఫా ప్రపంచ కప్ 2026: అర్జెంటీనా ఓటమి కారణలు ఇవే!
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:33 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో వరుసగా రెండోసారి టైటిల్ ముద్దాడాలని భావించిన అర్జెంటీనాకు బ్రేక్ పడింది. మైదానంలో అద్భుతమైన వ్యూహాలతో విరుచుకుపడిన స్పెయిన్ ముందు అర్జెంటీనా నిలువలేకపోయింది. ఈ నేపథ్యంలో తుదిపోరులో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మెస్సిపై ఎక్కువగా ఆధారపడటం!
అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సిని స్పెయిన్ డిఫెండర్లు అద్భుతంగా కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో మెస్సి కేవలం ఒక్కసారి మాత్రమే బంతిని తాకగలిగాడంటే స్పెయిన్ వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మెస్సిపైనే అర్జెంటీనా జట్టు అతిగా ఆధారపడటం.. ఆ జట్టు ఓటమికి ఓ కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్..
మ్యాచ్ రెండో అర్ధభాగంలో ఇంజూరీ టైమ్ (93వ నిమిషం)లో అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. స్పెయిన్ ప్లేయర్ పావ్ కుబార్సిని ఫౌల్ చేసినందుకు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో 10 ప్లేయర్లతోనే అర్జెంటీనా ఆడటం ఆ జట్టు కొంపముంచింది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టైమ్ సెకండ్ హాఫ్ 6వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ బంతిని నేరుగా నెట్ పైభాగానికి పంపి స్పెయిన్ శిబిరంలో సంబరాలు నింపాడు.
మిడ్‌ఫీల్డ్‌పై ఆధిపత్యం కోల్పోవడం:
మైదానం మధ్యప్రాంగణంలో (Midfield) స్పెయిన్ ఆటగాళ్ళు వేగవంతమైన పాస్‌లతో పూర్తి నియంత్రణ సాధించారు. రోడ్రీ నేతృత్వంలోని స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ అర్జెంటీనా దాడి వ్యూహాలను ఆదిలోనే తిప్పికొట్టింది.
డిఫెన్స్ తడబాటు:
అత్యంత కీలకమైన సమయాల్లో అర్జెంటీనా రక్షణ శ్రేణి (Defense) చిన్నపాటి పొరపాట్లు చేసింది. స్పెయిన్ ఫార్వర్డ్స్ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక కీలక నిమిషాల్లో గోల్ సమర్పించుకుంది.
ప్రత్యామ్నాయ వ్యూహాలు లేకపోవడం:
స్పెయిన్ తమ వేగవంతమైన 'కౌంటర్ ఎటాకింగ్' గేమ్‌తో ఒత్తిడి తెచ్చినప్పుడు, అర్జెంటీనా తక్షణ ప్రత్యామ్నాయ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమైంది. అలానే స్పెయిన్ యువ క్రీడాకారుల దూకుడు ముందు అర్జెంటీనా శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు కనిపించింది.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్ విషయంలో ఆ సెంటిమెంట్ పని చేసిందా!
FIFA World Cup: స్పెయిన్ అద్భుత విజయం
ఇంగ్లండ్ గోల్స్ జోరు ఫ్రాన్స్ బేజారు