FIFA World Cup: స్పెయిన్ అద్భుత విజయం
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:29 AM
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ అదరగొట్టింది.. సమష్టి ఆట, కట్టుదిట్టమైన రక్షణ, వేగవంతమైన దాడులతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌లో మేటి స్టార్స్ లేకపోయినా.. సమష్టిగా సత్తా చాటి ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచింది.
గోల్ ఇవ్వలేదు.. గెలుపు వదల్లేదు.. కట్టుదిట్టమైన డిఫెన్స్, వేగవంతమైన దాడులతో అర్జెంటీనాను పూర్తిగా కట్టడి చేసిన స్పెయిన్ ప్రపంచకప్‌పై మరోసారి తన ముద్ర వేసింది. స్టార్ల మెరుపుల కంటే సమష్టి స్ఫూర్తే గొప్పదని స్పెయిన్ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. మెస్సి మాయను మసకబార్చింది.. అర్జెంటీనా ఆశలను ఆవిరి చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపించి ప్రపంచకప్‌ను రెండోసారి కైవసం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో అదనపు సమయంలో నమోదైన ఏకైక గోల్‌తో స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది. ఫెరాన్ టోరెస్ (106వ నిమిషం) చేసిన గోల్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి ఆటను చక్కగా నడిపించగా.. యమాల్, ఒల్మో, నికో విలియమ్స్ వరుస దాడులతో అర్జెంటీనా డిఫెన్స్‌లో పడేలా చేశారు. ఐదో నిమిషంలోనే యమాల్ సృష్టించిన అవకాశాన్ని గోల్‌గా మలిచే పరిస్థితి వచ్చినా, గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్(అర్జెంటినా) అద్భుత సేవ్‌తో ప్రమాదాన్ని తప్పించాడు. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా స్టార్ మెస్సికి బంతి పెద్దగా అందలేదు. స్పెయిన్ ఆటగాళ్లు అతడిని సమర్థంగా కట్టడి చేయడంతో అతడి ప్రభావం కనిపించలేదు. మరోవైపు లిసాండ్రో మార్టినెజ్‌కు యెల్లో కార్డు రావడంతో పాటు గాయపడటంతో అతడి స్థానంలో ఒటామెండి బరిలోకి దిగాల్సి వచ్చింది.
విరామం తర్వాత స్పెయిన్ మరింత దూకుడు పెంచింది. వరుస దాడులతో అర్జెంటీనా డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. గోల్ కోసం పదేపదే ప్రయత్నించినా ఎమిలియానో మార్టినెజ్ అద్భుత ప్రదర్శనతో స్పెయిన్‌ను నిరాశపరిచాడు. అతడి వరుస సేవ్‌ల వల్లే మ్యాచ్ నిర్ణీత సమయంలో గోల్ లేకుండానే ముగిసి అదనపు సమయానికి చేరుకుంది.
అయితే స్టాపేజ్ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ రెడ్‌కార్డు అందుకోవడం అర్జెంటీనాకు పెద్ద దెబ్బగా మారింది. పది మంది ఆటగాళ్లతో బరిలో నిలిచిన ఆ జట్టు చివరకు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. అదనపు సమయం రెండో అర్ధభాగంలో నికో విలియమ్స్ హెడర్‌తో అందించిన బంతిని ఫెరాన్ టోరెస్ ఎడమకాలితో నెట్‌లోకి పంపడంతో స్పెయిన్‌కు ఆధిక్యం లభించింది. చివరి నిమిషాల్లో అర్జెంటీనా సమం చేసేందుకు ప్రయత్నించినా స్పెయిన్ రక్షణశ్రేణి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తుది విజిల్ మోగగానే స్పెయిన్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడుతూ ఫుట్‌బాల్ చరిత్రలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే..
ఫిఫా ప్రపంచకప్-2026 విజేతకు ఈసారి భారీగా నగదు బహుమతి దక్కింది. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్‌మనీని రూ.6,306 కోట్లుగా నిర్ణయించిన ఫిఫా.. గత ప్రపంచకప్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం పెంచింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు రూ.481 కోట్లు బహుమతిగా లభించగా.. రన్నరప్ అర్జెంటీనా రూ.317 కోట్లు లభించింది. మూడో స్థానం సాధించిన ఇంగ్లాండ్‌కు రూ.279 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌కు రూ.259 కోట్లు అందాయి. క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన జట్లకు ఒక్కోదానికి రూ.182 కోట్లు, ప్రిక్వార్టర్స్‌లో నిష్క్రమించిన జట్లకు రూ.144 కోట్లు చెల్లించారు. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన ప్రతి జట్టుకు రూ.105 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ అందుకున్నాయి.
Also Read