హిట్‌మ్యాన్ శతక్కొట్టినా..
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:29 AM
రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ లార్డ్స్‌లో రికార్డు శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగి తనపై వస్తున్న విమర్శలకు దీటైన జవాబిచ్చాడు...
మూడో వన్డేలో భారత్ ఓటమి
డకెట్ సెంచరీ
వెన్నువిరిచిన కర్రాన్ ఫ 2-1తో సిరీస్ ఇంగ్లండ్ వశం
రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ లార్డ్స్‌లో రికార్డు శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగి తనపై వస్తున్న విమర్శలకు దీటైన జవాబిచ్చాడు. కానీ, కొండంత లక్ష్య ఛేదనలో.. జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేక పోయాడు. నిర్ణాయక మూడో వన్డేలో ఓడిన టీమిండియా.. వరుసగా మూడో సిరీస్‌ను చేజార్చుకొంది.
లండన్: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) శతకంతో చెలరేగినా.. లార్డ్స్‌లో భారత్‌కు విజయం దక్కలేదు. ఆదివారం జరిగిన సిరీస్ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. దీంతో సిరీస్‌ను 1-2తో చేజార్చుకొంది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 387/3 స్కోరు చేసింది. బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్), బట్లర్ (13 బంతుల్లో 41 నాటౌట్) అదరగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్ ఓవర్లన్నీ ఆడి 360/7 స్కోరు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ (77), కోహ్లీ (74) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. సామ్ కర్రాన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లు ఓడిన భారత్.. వన్డే సిరీస్ ఓటమితో టూర్‌ను ముగించింది. బెథల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, రూట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచారు.
డెత్‌లో ఢమాల్..: కొండంత స్కోరు ఛేదనలో ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లేలో రక్షణాత్మకంగా ఆడడంతో టీమిండియా 49/0 స్కోరు మాత్రమే చేసింది. స్కోరు బోర్డు జోరందుకొంటున్న తరుణంలో గిల్‌ను రషీద్ ఎల్బీ చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీతో కలసి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించిన రోహిత్.. జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. రోహిత్ 31వ ఓవర్‌లో బౌండ్రీతో సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. కానీ, 39వ ఓవర్‌లో హిట్‌మ్యాన్‌ను బెథెల్ బౌల్డ్ చేయడంతో.. డెత్ ఓవర్లలో టీమిండియా తడబడింది. చివరి 60 బంతుల్లో 121 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ కిషన్ (14), శ్రేయాస్ అయ్యర్ (0)తోపాటు కోహ్లీని కర్రాన్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. కేఎల్ రాహుల్ (12)ను ఆర్చర్, అక్షర్ పటేల్ (2)ను కర్రాన్ పెవిలియన్ చేర్చారు. ఆఖర్లో గుర్నూర్ బ్రార్ (18 నాటౌట్), అర్ష్‌దీప్ (15 నాటౌట్) ఓటమి అంతరాన్ని తగ్గించారు.
దుమ్ము దులిపారు..: మోకాలి గాయంతో బుమ్రా దూరం కాగా.. ఐదుగురు ప్రధాన బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయలేక పోయారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు డకెట్, బెథల్ తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. అయితే, 31వ ఓవర్‌లో సెంచరీకి చేరువలో ఉన్న బెథెల్‌ను ప్రసిద్ధ్ క్యాచవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. కానీ, డకెట్, రూట్ రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. శతకం సాధించిన డకెట్‌ను ప్రిన్స్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయగా.. కెప్టెన్ బ్రూక్ (14)ను ప్రసిద్ధ్ స్వల్ప స్కోరుకే వెనక్కి పంపాడు. కానీ, డెత్ ఓవర్లలో రూట్, బట్లర్ (41 నాటౌట్) కేవలం 20 బంతుల్లోనే 63 పరుగులు జోడించడంతో.. టీమ్ స్కోరు 390 మార్క్‌కు చేరువైంది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్: డకెట్ (సి అండ్ బి) ప్రిన్స్ 141, బెథెల్ (సి) రోహిత్ (బి) ప్రసిద్ధ్ 91, రూట్ (నాటౌట్) 74, బ్రూక్ (సి) కోహ్లీ (బి) ప్రసిద్ధ్ 14, బట్లర్ (నాటౌట్) 41; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 50 ఓవర్లలో 387/3; వికెట్ల పతనం: 1-192, 2-293, 3-324; బౌలింగ్: అర్ష్‌దీప్ 10-0-72-0, ప్రసిద్ధ్ కృష్ణ 10-2-69-2, ప్రిన్స్ 10-0-79-1, బ్రార్ 10-0-97-0, అక్షర్ 10-0-61-0.
భారత్: రోహిత్ (బి) బెథెల్ 138, గిల్ (ఎల్బీ) రషీద్ 77, కోహ్లీ (సి) బ్రూక్ (బి) కర్రాన్ 74, ఇషాన్ (సి/సబ్) రేహన్ (బి) కర్రాన్ 14, శ్రేయాస్ (సి/సబ్) రేహన్ (బి) కర్రాన్ 0, రాహుల్ (బి) ఆర్చర్ 12, అక్షర్ (సి) జాక్స్ (బి) కర్రాన్ 2, గుర్నూర్ (నాటౌట్) 18, అర్ష్‌దీప్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 360/7; వికెట్ల పతనం: 1-147, 2-260, 3-304, 4-304, 5-315, 6-327, 7-329; బౌలింగ్: ఆర్చర్ 10-0-63-1, అట్కిన్సన్ 6-0-24-0, టంగ్ 5-1-43-0, కర్రాన్ 10-0-75-4, రషీద్ 8-0-64-1, జాక్స్ 4-0-38-0, బెథెల్ 7-0-49-1.
లార్డ్స్‌లో భారత్ తరఫున వన్డేల్లో
అత్యధిక వ్యక్తిగత స్కోరు
రోహిత్ శర్మ 138 (2026లో)
గంగూలీ 90 (2002లో)
మహ్మద్ కైఫ్ 87 నాటౌట్ (2002లో)
సురేశ్ రైనా 84 (2011లో)
ఎంఎస్ ధోనీ 78 నాటౌట్ (2011లో)
1
లార్డ్స్ వేదికగా వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ. అలాగే ఈ మైదానంలో శతకం సాధించిన పెద్ద వయస్కుడిగా (39 ఏళ్ల 80 రోజులు), అన్ని ఫార్మాట్లలోనూ లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.
1
టీమిండియా తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిసి బరిలోకి దిగిన జోడీగా రోహిత్, విరాట్ అరుదైన రికార్డు నెలకొల్పారు. సంగక్కర-జయవర్దనె జోడీ 550 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్నారు.
వెస్టిండీస్ గ్రేట్ సర్ గ్యారీ సోబర్స్ మృతికి సంతాపంగా భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.
ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, బెథెల్ తొలి వికెట్‌కు నెలకొల్పిన 192 పరుగుల భాగస్వామ్యం.. భారత్‌తో వన్డేల్లో అత్యధికం.
లండన్‌లో టీమిండియాకు భారత హైకమిషనర్ ఇచ్చిన విందు సందర్భంగా కోచ్ గంభీర్‌తో కోహ్లీ, రోహిత్
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!