Share News

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:46 PM

దేశీయ రక్షణ, విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్‌బస్ సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు.

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ రక్షణ, విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్‌బస్ సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు. వడోదర(గుజరాత్)లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL) తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియా 'ఎక్స్'లో పంచుకున్నారు.


ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీ కలలుగన్న 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాలకు ఈ ప్రాజెక్ట్ ప్రతీకగా నిలుస్తుంది. దేశంలో విమాన తయారీ సామర్థ్యం వేగంగా పెరుగుతోంది. త్వరలో భారతీయులు పూర్తిగా స్వదేశీ విమానాల్లోనే ప్రయాణిస్తారు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు' అని అన్నారు.


కాగా.. ఎయిర్‌బస్-టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో అమలవుతున్న సీ-295 ప్రాజెక్ట్ కింద తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఓ క్లిష్టమైన సైనిక విమానం భారత్‌లో తయారవుతోంది. దీనికి 2021లో 2.6 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత్‌కు మొత్తం 56 సీ-295 విమానాలు అందించాలి. వీటిలో 16 విమానాలు స్పెయిన్‌లో మాన్యుఫాక్చర్ కానుండగా, మరో 40 విమానాలను వడోదరలో తయారు చేస్తున్నారు. అందులో భాగంగా.. తొలి సీ-295 విమానాన్ని జూన్ 10న విజయవంతంగా పరీక్షించారు. ఇటీవల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రాజెక్టును గురించి ప్రస్తావించారు. సీ-295 తయారీ వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈలు) కొత్త అవకాశాలు లభిస్తాయని, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నైపుణ్యాభివృద్ధి, దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమ విస్తరణకు ఇది కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

సోనమ్ వాంగ్‌‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్

Updated Date - Jul 19 , 2026 | 04:29 PM