Share News

ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:10 PM

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇవాళ (ఆదివారం) కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది.

ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..
All Party Meeting

న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆదివారం) కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హైడ్రామా చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. అయితే, ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం ఇవ్వడాన్ని ఆ పార్టీ నిరసించింది. దీంతో ఇండియా కూటమి పార్టీల నేతలు వాకౌట్ చేశారు.


అఖిలపక్ష సమావేశానికి టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను ఆహ్వానించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. లోక్‌సభలో వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం, స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి గుర్తింపు కల్పించేలా వ్యవహరించడంపై మండిపడ్డాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించాయి. ఈ సందర్భంగా శివసేన(యూబీటీ) తిరుగుబాటు ఎంపీల విలీన అంశాన్నీ విపక్షాల నేతలు ప్రస్తావించారు.


వాకౌట్ అనంతరం కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా వాకౌట్ చేశాయని తెలిపారు. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా అభివర్ణించారు.


టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. అధికారికంగా గుర్తింపు లేని ఎన్‌సీపీఐ పేరుతో ఉన్న తిరుగుబాటు ఎంపీలను ఏ ప్రాతిపదికన సమావేశానికి పిలిచారని ప్రశ్నించారు. వారిపై ఉన్న అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రత్యేక బ్లాక్‌కు అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ చర్యకు నిరసనగానే ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయని చెప్పారు.


అయితే నిరసన అనంతరం విపక్ష పార్టీలు తిరిగి సమావేశ మందిరానికి చేరుకుని చర్చల్లో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, వి. మురళీధరన్, అను ప్రియా పటేల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..

Updated Date - Jul 19 , 2026 | 01:20 PM