Share News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:26 AM

ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ వేశారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..
Geetanjali Angmo

ఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలపై తనకు నమ్మకం పోయిందని, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి సోనమ్‌ను తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును విన్నవించారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని ఆంగ్మో అభ్యర్థించారు.


ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారని కోర్టు దృష్టికి ఆంగ్మో తీసుకెళ్లారు. వైద్యం పేరుతో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21లను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని, దీనిపై వెంటనే రిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాంగ్‌చుక్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులకు అవకాశం కల్పించడం లేదని పేర్కొన్నారు. నిరాహార దీక్ష సందర్భంగా గత 20 రోజులుగా ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులను కలుసుకోనివ్వడం లేదని ఆరోపించారు. వాంగ్‌చుక్‌ను తక్షణమే నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఈ విషయాన్ని ఆంగ్మో ఎక్స్ వేదికగా తెలియజేశారు.


ఈ సందర్భంగా వాంగ్‌చుక్ పొటాషియం స్థాయిలపైనా ఆంగ్మో ఆందోళన వ్యక్తం చేశారు. పొటాషియం స్థాయిల విషయంలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి అంచనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన పొటాషియం స్థాయి 2.9కి పడిపోయిందని, అది ప్రాణాంతకమని ఆస్పత్రి అధికారులు తమకు చెప్పారన్నారు. కానీ, ఆస్పత్రి విడుదల చేసిన పబ్లిక్ హెల్త్ బులెటిన్‌లో ఆ సంఖ్యను వెల్లడించకుండా కేవలం పొటాషియం స్థాయిలు తగ్గుతున్నాయని మాత్రమే పేర్కొన్నారని ఆరోపించారు. అయితే, దాదాపు 10 గంటల పాటు తాము పోలీసులను అభ్యర్థించామని, ఆ తర్వాత వాంగ్‌చుక్ రక్త నమూనాను సేకరించడానికి అనుమతి ఇచ్చారన్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా ఆయన పొటాషియం స్థాయి 3.5గా తేలిందన్నారు.


అయితే, తాము పదేపదే అభ్యర్థించినప్పటికీ వాంగ్‌చుక్‌ను డిశ్చార్జ్ చేయడానికి గానీ, ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడానికి గానీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నిరాకరించిందన్నారు. తన భర్త వాంగ్‌చుక్ ఉన్న అంతస్తులో సుమారు 30 మంది పోలీసులు ఉన్నారని, ఆస్పత్రి అంతటా 100 మందికి పైగా మోహరించారని తెలిపారు. ఇది వైద్య సంరక్షణ కాదు.. చట్టవిరుద్ధమైన నిర్బంధమంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వాంగ్‌చుక్‌కు ఏదైనా జరిగితే ఆస్పత్రి అధికారులు, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. తన భర్త ఆరోగ్యం మరింతగా క్షీణించక ముందే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు తక్షణ అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు గీతాంజలి ఆంగ్మో చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు..

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

Updated Date - Jul 19 , 2026 | 11:49 AM