వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..
ABN , Publish Date - Jul 19 , 2026 | 08:22 AM
దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామ ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
బిహార్: దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పైగా గురువారాల్లో మాత్రమే చోరీలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. దీంతో గురువారం వచ్చిందంటే ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మిగతా రోజుల్లోనూ ఇంటిపై పడతారేమోననే భయంతో రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి దర్హార్ గ్రామంలో జులై 8న ఓ చోరీ జరిగింది. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా ఉంటున్న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డారు. పవన్ కోడలు కరిష్మా దేవి(22) నిద్రిస్తుండగా దాడి చేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి వీపుపై ఓ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం కరిష్మా స్పృహ కోల్పోవడంతో దొంగతనానికి పాల్పడ్డారు. ఎలాంటి శబ్దం రాకుండా ఉండేందుకు టీవీ సౌండ్‌ను పెద్దగా పెట్టారు. 20 నిమిషాల్లో రెండు అల్మారాలను పగలగొట్టి రూ.35 వేలు, రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. వెళ్లే ముందు మహిళ జుట్టును కత్తిరించారు. ఆమె అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. ఈసారి ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ చౌదరి ఇల్లే లక్ష్యంగా చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను దోచుకున్నారు. అదే సమయంలో ఆయన చిన్న కుమార్తె జుట్టును కత్తిరించి పరారయ్యారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది. ఫోరెన్సిక్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు దొంగతనాలు గురువారమే జరగడంతో పాటు అనేక సారూప్యతలు ఉండటంతో ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు, ఈ ముఠా దొంగతనాల తీరుపై దర్హార్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రచారం జరిగింది. దీంతో దొంగతనాల కంటే మహిళల జుట్టు కత్తిరిస్తున్నారనే వార్త ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..
విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..