Share News

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:17 AM

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ యాత్రను జులై 19 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..
Amarnath Yatra 2026

జమ్మూ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ యాత్రను జులై 19 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యాత్రికుల భద్రత దృష్ట్యా బల్తాల్, నున్వాన్/చందన్‌వారి బేస్ క్యాంపుల నుంచి తదుపరి ప్రయాణానికి అనుమతి లేదని తెలిపారు. యాత్రా మార్గం భద్రతను నిర్ధారించుకుని, వాతావరణ పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన అనంతరం యాత్ర పునఃప్రారంభంపై భక్తులకు సమాచారం అందిస్తామని కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ వెల్లడించారు.


భారీ వర్షాలు..

ఇదిలా ఉండగా.. జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జులై 19 నుంచి 23 వరకు ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జమ్మూ, రాజౌరి, దోడా, రాంబన్, కతువా, సాంబా, కిష్త్వార్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రియాసి, ఉధంపూర్‌లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీని కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.


కొన్ని ప్రాంతాల్లో జులై 24 నుంచి వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం జులై 27 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, చిరుజల్లులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, కాశ్మీర్‌లో తీవ్రమైన వడగాల్పుల కారణంగా పాఠశాలలకు జులై 6 వరకు ప్రకటించిన వేసవి సెలవులను జులై 22 వరకు విద్యాశాఖ పొడిగించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఆగస్టు 28న ముగియనున్న 57 రోజుల శ్రీ అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 3.7 లక్షలకు పైగా భక్తులు పవిత్ర గుహ ఆలయాన్ని దర్శించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?

వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి

Updated Date - Jul 19 , 2026 | 07:34 AM