Share News

వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:30 AM

వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది...

వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి

  • వారు వద్దంటేనే వేరేవారికి అమ్మాలి

  • సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, జూలై 18: వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 22 ప్రకారం ‘క్లాస్‌-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్‌-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్‌-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్‌ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది. భాగస్వామి ఎవరైనా తన వాటాను అమ్ముకోదలిస్తే దాన్ని తొలుత సహ భాగస్వాములు కొనుగోలు చేస్తారేమోనని అడిగి చూడాల్సి ఉంటుంది. ఈ సెక్షన్‌ భూములకు కూడా వర్తిస్తుందని తాజాగా స్పష్టం చేసింది. వాటాగా వచ్చిన ఆస్తులను తోబుట్టువులు వేరేవారికి విక్రయించడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 19 , 2026 | 06:30 AM