సింధు చరిత్ర
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:33 AM
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సుదీర్ఘ విరామానంతరం టైటిల్ సాధించింది. ఈ తెలుగు తేజం జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-17, 21-17తో...
ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్‌గా రికార్డు
తెలుగుతేజం ఖాతాలో జపాన్ ఓపెన్
టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సుదీర్ఘ విరామానంతరం టైటిల్ సాధించింది. ఈ తెలుగు తేజం జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-17, 21-17తో వరల్డ్ నెంబర్. 3 అకానె యమగూచి (జపాన్)కి షాకిచ్చింది. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డుకెక్కింది. అంతేకాదు.. 2024 డిసెంబరులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గకపోవడంతో ఆమె పనైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ గెలుపుతో సింధు దీటైన సమాధానం ఇచ్చింది.
అజేయంగా: ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండా సింధు టైటిల్‌ను సాధించడం విశేషం. ఫైనల్లో స్థానిక షట్లర్ యమగూచికి అభిమానుల నుంచి లభిస్తున్న మద్దతును ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకాగత్రతో ప్రశాంతంగా ఆడుతూ పాయింట్లతోనే బదులిచ్చింది. యమగూచి బలమైన స్మాష్‌లకు సింధు తన ట్రేడ్‌మార్క్ క్రాస్ కోర్టు షాట్‌లతో జవాబిచ్చింది. 2022 సింగపూర్ ఓపెన్ తర్వాత విదేశీ గడ్డపై సింధు సాధించిన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ఇదే.

ఈ విజయం అపురూపం
ఈ విజయం నాకు చాలా.. చాలా ముఖ్యమైనది. గత కొంతకాలంగా నా ప్రదర్శనపై చాలా మంది అసలు నీకు ఏమైంది? అని ప్రశ్నించారు. గాయాలు, ఫామ్ లేమి పరీక్షించిన ప్రతిసారీ తట్టుకొని నిలబడ్డా. సుమారు రెండేళ్ల తర్వాత లభించిన ఈ గెలుపు నాకు అపురూపమైనది. ఈ విజయం కోసం చాలా ఎదురు చూశా. ఇప్పుడు కంట నీరు ఆగడంలేదు. ఈ గెలుపు నాకు కొత్త నమ్మకాన్ని, భవిష్యత్తులో మరిన్ని సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నా పనైపోలేదు. నేనింకా సాధించగలను. ఈ టోర్నీ విషయానికొస్తే తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు సానుకూల దృక్పథంతో ప్రశాంతంగా ఆడాను. నా దూకుడైన శైలిలో ఆడగలిగా. సుదీర్ఘమైన ర్యాలీల్లోనూ, కీలక సమయాల్లోనూ ఏకాగ్రతతో ప్రశాంతంగా ఆడి విజయం సాధించాను.
- పీవీ సింధు
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు
జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘సింధుకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక కలికితురాయి. వరుస గేముల్లో యమగూచిపై గెలిచి, జపాన్ ఓపెన్ టైటిల్‌ను సాధించినందుకు శుభాకాంక్షలు. వచ్చే ఒలింపిక్స్‌కు ఆల్ ది బెస్ట్’ అని చంద్రబాబు అన్నారు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!