Share News

ఇంగ్లండ్‌ గోల్స్‌ జోరు ఫ్రాన్స్‌ బేజారు

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:43 AM

ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆదివారం తెల్లవారుజామున ఇంగ్లండ్‌-ఫ్రాన్స్‌ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో...

ఇంగ్లండ్‌ గోల్స్‌ జోరు ఫ్రాన్స్‌ బేజారు

6-4తో హ్యారీ కేన్‌ సేన విజయం

మూడో స్థానంతో కాంస్య పతకం కైవసం

ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. ఆదివారం తెల్లవారుజామున ఇంగ్లండ్‌-ఫ్రాన్స్‌ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో ఏకంగా పది గోల్స్‌ నమోదు కావడం విశేషం. ఆరంభం నుంచే రాకెట్‌ వేగంతో దూసుకెళ్లిన ఇంగ్లండ్‌ను సెకండా్‌ఫలో ఎంబాపె బృందం అడ్డుకున్నా.. చివర్లో మెరుపు గోల్స్‌తో పుంజుకున్న ఇంగ్లండ్‌ కాంస్య పతకం ఎగరేసుకుపోయింది. దీంతో ఆఖరి వరకు పోరాడిన ఫ్రాన్స్‌ తీవ్ర నిరాశతో వెనుదిరిగింది.

సాకా హ్యాట్రిక్‌

ఎంబాపె రికార్డు

గోల్స్‌ వృధా

మయామి గార్డెన్స్‌: ఫిఫా వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ అదిరే విజయంతో ముగించింది. ఇక ఫ్రాన్స్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపె ఈ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక గోల్స్‌ (22)తో రికార్డు సృష్టించినప్పటికీ తమ జట్టును మాత్రం గట్టెక్కించలేకపోయాడు. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన ఈ పోరులో గోల్స్‌ వర్షం కురవగా, చివరకు ఇంగ్లండ్‌ 6-4 తేడాతో నెగ్గింది. బుకాయో సాకా (37, 45+1, 87 నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే డెక్లాన్‌ రైస్‌ (3), ఎజ్రి కోన్సా (18), బెల్లింగ్‌హామ్‌ (90+8) ఇతర గోల్స్‌ చేసిన ఆటగాళ్లు. అటు ఫ్రాన్స్‌ నుంచి ఎంబాపె (48, 66), బ్రాడ్లీ బార్కోలా (54), ఔస్మాన్‌ డెంబెలె (90+6) గోల్స్‌ అందించారు. 1966లో ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత మరోసారి వరల్డ్‌కప్‌ మెడల్‌ దక్కించుకోగలిగింది. మరోవైపు ఎంబాపె ఈ టోర్నీలో పది గోల్స్‌తో మెస్సీ (8)ని దాటేశాడు.

మూడో నిమిషంలోనే..

ప్రథమార్ధంలో ఇంగ్లండ్‌ ఆధిపత్యం ముందు ఫ్రాన్స్‌ పూర్తిగా తేలిపోయింది. ఆరంభంలో హ్యారీ కేన్‌, బెల్లింగ్‌హామ్‌ బెంచీకే పరిమితమైనా.. ఇంగ్లండ్‌ పదే పదే ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ను ఛేదిస్తూ ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పైకి ఎదురుదాడి చేసింది. దీంతో ఫస్టా్‌ఫలోనే ఏకంగా 4-0తో తిరుగులేని పట్టు సాధించింది. ఆట ఆరంభమైన మూడో నిమిషంలోనే రైస్‌ గోల్‌తో ఇంగ్లండ్‌ బోణీ చేసింది. ఈ షాక్‌ నుంచి ఫ్రాన్స్‌ తేరుకునేలోపే 18వ నిమిషంలో కోన్సా, 37వ నిమిషంలో సాకా గోల్స్‌ అందించారు. దీనికితోడు స్టాపేజ్‌ సమయంలో సాకా తన రెండో గోల్‌తో ఫ్రాన్స్‌ బిత్తరపోయింది.


కిలియన్‌ చెలరేగినా..

ద్వితీయార్ధంలో ఫ్రాన్స్‌ గణనీయంగా పుంజుకుంది. ముఖ్యంగా కిలియన్‌ ఎంబాపె జట్టును ఆదుకునే బాధ్యత తీసుకుని 48వ నిమిషంలో తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత బార్కోలా గోల్‌ సాధించగా, 66వ నిమిషంలో 14 గజాల దూరం నుంచి ఎంబాపె తన ఎడమ కాలితో బంతిని నెట్‌లోకి పంపాడు. తనకిది ఈ టోర్నీలో పదో గోల్‌ కావడం విశేషం. అటు స్కోరు కూడా 4-3గా మారడంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది. ఇదే జోరుతో ఫ్రాన్స్‌ స్కోరును సమం చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. దీంతో సాకా హ్యాట్రిక్‌ గోల్‌ పూర్తి చేశాడు. పట్టు వదలని ఫ్రాన్స్‌ అదనపు సమయంలో డెంబెలె గోల్‌తో పుంజుకున్నా.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బెల్లింగ్‌హామ్‌ చివరి క్షణాల్లో ఫ్రెంచ్‌ డిఫెండర్లను తప్పిస్తూ చేసిన గోల్‌తో ఫ్రాన్స్‌కు 4-6తో ఓటమి తప్పలేదు.

వరల్డ్‌కప్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో ఏకంగా పది గోల్స్‌ నమోదు కావడం ఇదే తొలిసారి.

1

ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ (22) సాధించిన ప్లేయర్‌గా కిలియన్‌ ఎంబాపె. మెస్సీ (21)ని అధిగమించాడు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 05:43 AM