ఫిఫా పోడియంపై ట్రంప్ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:00 AM
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ట్రంప్ వ్యవహరించిన తీరు విస్తృత చర్చకు దారితీసింది. స్పెయిన్ జట్టు ట్రోఫీ అందుకున్న తర్వాత కూడా ట్రంప్ పోడియంపై కొద్దిసేపు అలాగే ఉండిపోవడంతో అసౌకర్యకర పరిస్థితి నెలకొంది.
ఇదీ జరిగింది..
విజేతగా నిలిచిన స్పెయిన్ కెప్టెన్ రోడ్రీకి ఫిఫా ట్రోఫీని అందజేసిన అనంతరం ట్రంప్ వెంటనే వేదకపై నుంచి వెళ్లకుండా అక్కడే నిలిచినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. జట్టు విజయోత్సవాలకు సమయం సమీపిస్తుండటంతో రోడ్రీ ఆయన్ను పక్కకు జరగాలని సైగ చేసినట్టూ తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ అక్కడే ఉండటంతో చివరకు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో స్వయంగా జోక్యం చేసుకుని పోడియం నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో అర్జెంటీనా డిఫెండర్ క్రిస్టియన్ రొమెరో, ట్రంప్‌తో కరచాలనం చేయలేదు. ఈ వీడియోపై కూడా నెటిజన్లు పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ ఘటన వెనుక కారణాలపై ఎలాంటి అధికారిక సమాచారమూ వెలువడలేదు.
న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో సుమారు 80 వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌ను ట్రంప్.. ఇన్ఫాంటినోతో కలిసి వీక్షించారు. ఆ తర్వాత ట్రోఫీ బహూకరించేందుకు ట్రంప్, ఇన్ఫాంటినో మైదానంలోకి వస్తుండగా ప్రేక్షకుల నుంచి నిరసన సెగ తగిలినట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026: అర్జెంటీనా ఓటమి కారణలు ఇవే!
వెంటనే మరో ప్రపంచ కప్ నిర్వహిస్తాం: ట్రంప్