ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:45 AM
ఫిఫా ప్రపంచ కప్-2026లో స్పెయిన్ ఆటగాళ్లు సత్తాచాటారు. వ్యక్తిగత విభాగాల్లో ఏకంగా మూడు పురస్కారాలను ఆ జట్టు కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్-2026లో టీమ్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తాచాటారు. ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్.. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ సహా బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది.
టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించిన స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ రోడ్రీకి అత్యుత్తమ ఆటగాడికి దక్కే గోల్డెన్ బాల్ పురస్కారం లభించింది. ఫైనల్ సహా ప్రతి మ్యాచ్‌లోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించినందుకు గానూ ఈ గౌరవాన్ని అందుకున్నాడు రోడ్రీ. స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ గోల్డెన్ గ్లోవ్ అవార్డును దక్కించుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 7 క్లీన్ షీట్లు సాధించిన అతడు.. టోర్నీలో ఒకే ఒక్క గోల్ ఇచ్చి, స్పెయిన్ పటిష్ఠ డిఫెన్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. వరుసగా 650 నిమిషాల పాటు గోల్ సమర్పించకుండా ప్రపంచ కప్‌లో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పాడు సైమన్. ఇక అదే జట్టుకు చెందిన యంగ్ డిఫెండర్ పౌ కుబార్సీ ఫిఫా బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 19ఏళ్ల ఈ యువ ఆటగాడు తన నిలకడైన ప్రదర్శనతో టోర్నీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరోవైపు.. ఫ్రాన్స్ స్టార్, కెప్టెన్ కిలియన్ ఎంబాపే 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నాడు. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లోనూ గోల్డెన్ బూట్ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ఎంబాపే.. పురుషుల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్(22) సాధించిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. టోర్నీలో రెండో అత్యుత్తమ ఆటగాడిగా అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి-సిల్వర్ బాల్, మూడో అత్యుత్తమ ఆటగాడిగా ఎంబాపే-బ్రాంజ్ బాల్ అందుకున్నారు. గోల్స్ విభాగంలో మెస్సి-సిల్వర్ బూట్, ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ బ్రాంజ్ బూట్ సొంతం చేసుకున్నారు. ఇక.. ఉత్తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు గానూ నెదర్లాండ్స్ జట్టుకు ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ దక్కింది.
ప్రపంచకప్-2026 అవార్డుల జాబితా:
గోల్డెన్ బాల్: రోడ్రీ (స్పెయిన్)
సిల్వర్ బాల్: లియోనెల్ మెస్సి (అర్జెంటీనా)
బ్రాంజ్ బాల్: కిలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)
గోల్డెన్ బూట్: కిలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)
సిల్వర్ బూట్: లియోనెల్ మెస్సి (అర్జెంటీనా)
బ్రాంజ్ బూట్: జూడ్ బెల్లింగ్‌హామ్ (ఇంగ్లండ్)
గోల్డెన్ గ్లోవ్: ఉనై సైమన్ (స్పెయిన్)
ఉత్తమ యువ ఆటగాడు: పౌ కుబార్సీ (స్పెయిన్)
ఫెయిర్ ప్లే ట్రోఫీ: నెదర్లాండ్స్
ఇవీ చదవండి:
ఫిఫా పోడియంపై ట్రంప్ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో
ప్రపంచకప్ ఫైనల్: కొట్టుకున్న స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు!