Share News

'టికీ-టాకా'కు కొత్త హంగులు.. స్పెయిన్ విజయ సూత్రమదే.!

ABN , Publish Date - Jul 20 , 2026 | 02:12 PM

ఈ ఏడాది ఫిఫా ప్రపంచ కప్‌ను స్పెయిన్ గెలవడం వెనుక ఓ బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధంతోనే సమష్టి కృష్టితో ఆ జట్టు రెండోసారి కప్పు ఎగరేసుకుపోయింది. ఇంతకీ ఆ వెపన్ ఏంటి? దాని వెనకున్న రహస్యమేంటో ఓ లుక్కేద్దాం...

'టికీ-టాకా'కు కొత్త హంగులు.. స్పెయిన్ విజయ సూత్రమదే.!

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌-2026ను గెలుచుకోవడం ద్వారా స్పెయిన్ మరో ట్రోఫీని మాత్రమే అందుకోలేదు.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాన్ని బలంగా వినిపించింది. ఆ జట్టు కోచ్ లూయిస్ డి లా ఫ్యూంటె నేతృత్వంలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమన్వయంతో బరిలోకి దిగిన స్పెయిన్.. ఆద్యంతం అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ అజేయంగా నిలిచింది. ఇక.. ఆ జట్టు సమష్టి విజయం సాధించడంలో మరో బలమైన ఆయుధమూ ఉంది. అదే టికీ-టాకా. ప్రత్యర్థి పూర్తిగా అలసిపోయేట్లు చేయడం, ఆపై వేటాడటం ఇందులో ప్రధానం. స్టార్ ఆటగాళ్లు మెస్సి, రొనాల్డో, ఎంబాపెలనూ గోల్‌ కోసం చెమటోడ్చేలా చేసిన వ్యూహమది. నిజానికి మెస్సి, రొనాల్డోలకు దీనిపై అవగాహన ఉన్ననూ.. స్పెయిన్ ఆటతీరు చూస్తూ మిన్నకుండిపోయారు. ఈ వ్యూహంతోనే ఆ జట్టు పెద్దపెద్ద టైటిళ్లను ఎగరేసుకుపోయింది. 2010 ప్రపంచకప్‌ కూడా ఈ రకంగా దక్కినదే.


ఇక.. టికీ-టాకా వ్యూహంలో స్పెయిన్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ సమయంలో బంతిని వీలైనంత ఎక్కువ సేపు తమ అధీనంలోనే ఉంచుకుంటారు. సమీప దూరంలో త్రిభుజాకారంలో ఏర్పడి ఒకరికొకరు బంతిని పాస్‌ చేసుకుంటూ ఉంటారు. ఖాళీ ప్రదేశాలను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రత్యర్థి జట్టు అసహనానికి గురయ్యేలా చేస్తారు. సుమారు 30 ఏళ్ల క్రితం బార్సిలోనా జట్టు దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది. 2010లో స్పెయిన్‌ ప్రపంచకప్‌ గెలవడంలో ఈ వ్యూహమే కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా ఆ జట్టును మరింత దుర్భేద్యంగా మార్చిందీ వ్యూహం. కానీ, రానురానూ ప్రత్యర్థి జట్లూ తమ డిఫెన్స్‌లను బలోపేతం చేసుకుని దీనికి విరుగుడు కనిపెట్టాయి. దీంతో స్పెయిన్‌ ఎక్కువగా పాస్‌లకే పరిమతమై, గోల్స్‌ చేయడంలో విఫలమైంది. ఫలితంగా 2018, 2022 ప్రపంచకప్‌ల్లో బోల్తాపడింది.


ఈ నేపథ్యంలో స్పెయిన్ కోచ్‌‌గా లూయిస్‌ ఫుయెంటె బాధ్యతలు స్వీకరించాక 'టికీ-టాకా' కొత్త హంగులు సంతరించుకుంది. గతంలో పాస్‌లకే పరిమితమైన ఈ వ్యూహాన్ని ప్రత్యర్థి మోహరింపుల్లో గ్యాప్‌లను గుర్తించి దాడులు చేయడంపై స్పెయిన్‌ దృష్టి సారించింది. బంతిని అతిగా హోల్డ్‌ చేయకుండా గోల్ సాధించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం యువ వింగర్లు యమాల్‌, విలియమ్స్‌ వంటి వారిని సానబట్టింది. ఇది ఆ జట్టుకు సత్ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 14 గోల్స్‌ సాధించిన స్పెయిన్.. ప్రత్యర్థికి ఒక్క గోల్‌ మాత్రమే సమర్పించుకుంది. ఇలా స్పెయిన్ జట్టు రెండోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను ముద్దాడటంలో ఈ వ్యూహం కీలకపాత్ర పోషించింది.


ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?

ఫిఫా పోడియంపై ట్రంప్‌ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో

Updated Date - Jul 20 , 2026 | 02:55 PM